Monday, December 23, 2024

ఇదేక్కడి ‘పంచాయతీ’

- Advertisement -
- Advertisement -

సకాలంలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా…?
రాష్ట్రంలో బిసి లెక్క తేలిన తరువాతే
ఈ ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ నేతలు, బిసి నాయకుల డిమాండ్
ఎన్నికలు ఆలస్యం అయితే కేంద్రం నుంచి
నిధులు ఆగుతాయని ప్రభుత్వ భావన
ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సమరంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలయ్యింది. అందులో భాగంగా బిసిల లెక్క తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు తక్కువ సమయం ఉండడం అప్పటిలోగా బిసిల కులగణన పూర్తవుతుందా లేదా అన్న సందిగ్ధతలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది.

52 శాతానికి మించి రాష్ట్రంలో బిసి జనాభా

బిసిల కులగనణ త్వరగా తేల్చే అంశం కాదు. 52 శాతానికి మించి రాష్ట్రంలో బిసి జనాభా ఉంది. దీంతో బిసిల లెక్క తెలడానికి ఎక్కువ సమయం బట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగని పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామంటే బిసిలు అంగీకరించే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక బాధ నిర్వహించకపోతే మరో బాధ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. దీంతో పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్లు మారింది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం మాదిరిగా బిసిల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సకాలంలో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందా లేక బిసి కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

నిధులు ఆగిపోతే అపకీర్తిని మూటకట్టుకోవాల్సి…..

అయితే పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలను విధిగా నిర్వహించాలి సాంకేతిక లేక రాజకీయపరమైన కారణాలతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తే కేంద్ర నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. అప్పుడు పంచాయ తీల అభివృద్ధి కుంటుపడుతుంది. దీనివల్ల ప్రభుత్వం అపకీర్తిని మూటకట్టుకోవాల్సి వస్తోంది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహిద్దామంటే ఈ బిసిల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోంది.

ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన కాకుండా….

ఇప్పటికే సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల పాలన కొనసాగుతోంది. అయితే ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచకుండా సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిసిలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా కుల గణన చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కానీ, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కులగణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో బిసిల జనాభా లెక్క తేలేందుకు మరింత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో బిసిల రిజర్వేషన్‌లు 23 శాతానికి కుదింపు…

కులగణన జరిగేంత వరకు పంచాయతీ ఎన్నికలను ఆపొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ గణన జరిగితే అప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బిసిల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదిస్తూ గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు బిసి రిజర్వేషన్ల లెక్క తేల్చాలని సూచించింది.

42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ

దానికి అనుగుణంగా బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అదే సమయంలో బిసి కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బిసి సంఘాలు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు సరైన ప్రాతినిథ్యం కల్పించలేదని అందుకే పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తే పంచాయతీ ఎన్నికల్లో కూడా బిసిలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఐదేళ్లకు ఒకసారి వచ్చే పంచాయతీ ఎన్నికలను కొంతకాలం వాయిదా వేసి బిసి జనాభా లెక్కలు తేలిన తర్వాత జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు పంచాయతీలో బిసిలకు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News