Monday, December 23, 2024

గ్రామాల్లో ఎన్నికల సందడి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఓటరు జాబితాకు షెడ్యూల్ విడుదల చేయడంతో దసరా నాటికి ఎన్నికలు రావచ్చనే అంచనాలతో ఆశావాహులు సందడి చేస్తున్నారు. బూత్‌ల వారీగా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇక రిజర్వేషన్ల హడావుడి అయితే కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో అవలంభించిన రిజర్వేషన్లే ఈసారి కూడా అమలు జరుగుతాయని తెలుస్తోంది. బిసి కులగణన చేపట్టిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రుల స్థాయిలోనే ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నారు తప్ప స్పష్టత లేదు. ప్రస్తుతం ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం సెప్టెంబరు 6న గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా జాబితాను జారీ చేయనుంది.

దీనిపై 7వ తేదీ నుంచి 13 వరకు డీపీవోలు, ఎంపీడీవోలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. 19వ తేది లోగా అభ్యంతరాలను పరిష్కరించి 21న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీంతో పాటు ఎన్నికల కమిషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. ఈ నెల 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల జాబితాపై సెప్టెంబరు 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులతో జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం 200 మంది ఓటర్లతో ఉండే విధంగా బూత్‌లను ఏర్పాటు చేయడం, బూత్‌లో ఒక ప్రీసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లు ఉన్న బూత్‌లో ఒక ప్రీసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 600 మంది ఓటర్లు ఉండే పోలింగ్ బూత్‌లో ఒక ప్రీసైడింగ్ అధికారితోపాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించే విధంగా ఎన్నికల సంఘం సిబ్బంది నియామాకాన్ని చేపట్టనుందని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సిబ్బంది నియామకం, బూత్‌ల స్థాయిలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

గత పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12751 గ్రామ పంచాయతీలు ఉండగా 12,732 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫై చేసింది. అలాగే ఈ పంచాయతీల్లో 1,13,354 వార్డులు ఉంటే వాటిలో 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫై చేసింది. అప్పట్లో వీటిలో 24 సర్పంచ్ ఎన్నికకు, 492 వార్డు ఎన్నికలకు నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా 2134 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వార్డు సభ్యుల పదవులు 29,985 కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 10,571 సర్పంచ్ పదవులకు, 82,675 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ లెక్కన 2024లో జరుగబోయే ఎన్నికల్లో ఎన్ని సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవుతాయి, ఎన్నికలు జరుగుతాయో చూడాల్సి ఉంది.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఏకగ్రీవం చేయాలనే అంశంపై మంతనాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల కారణంగా ఏకగ్రీవం చేసే పంచాయతీలే ఎక్కువ ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని చోట్ల పోటీ అనివార్యమైతే ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 2018 మే 17 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య 1,37,17,469 ఉండగా, వీటిలో పురుష ఓటర్లు 68,50,309 ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 68,66,300 మంది, ఇతరులు 860 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో 96,029 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్ స్టేషన్లు కూడా గణనీయంగా పెరుగుయని భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News