మధుమేహం అనేది ఇవాళ కొత్తగా వెలుగు చూసిన వ్యాధి కాదు. దశాబ్దాల తరబడి ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తూ, వేల సంఖ్యలో ప్రాణాలు కబళిస్తోంది ఈ మహమ్మారి. హిందూ, ఈజిప్టు ప్రాచీన గ్రంథాలలో సైతం ఈ వ్యాధి ప్రస్తావన ఉందంటే ఇది ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ వ్యాధిలోనే మరో రకం బయటపడటం, అది ప్రాణాంతకమని వైద్యనిపుణులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మధుమేహంలో టైప్ 1, టైప్ 2 అనే రకాలు ఉన్నాయని మాత్రమే అందరికీ తెలుసు. కానీ, కొత్తగా టైప్ 5 రకం బయటపడినట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ఇటీవల అధికారికంగా ప్రకటించింది. బ్యాంకాక్‌లో జరిగిన సదస్సులో ఐడిఎఫ్ ప్రతినిధులు టైప్ 5 లక్షణాల గురించి వివరిస్తూ, పోషకాహార లోపంతో ఈ వ్యాధి పొడసూపుతోందనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమితాహారం తీసుకోవడం మధుమేహ కారకాల్లో ఒకటి కాగా, పోషకాలు లోపించడమూ మధుమేహానికి దారితీస్తుందనడం ఆశ్చర్యం కాక మరేమిటి? సాధారణంగా 40 ఏళ్ల పైబడినవారిలోనే మధుమేహ లక్షణాలు బయటపడటం కద్దు కాగా, టైప్ 5 రకానికి 19 ఏళ్ల లోపు యువత ఎక్కువగా లోనవుతున్నట్లు ఐడిఎఫ్ స్పష్టం చేస్తోంది. టైప్ 1, టైప్ 2 రకాలను మందులు లేదా ఇంజెక్షన్లతో అదుపు చేసే అవకాశం ఉండగా, టైప్ 5 మధుమేహాన్ని గుర్తించడమూ, నయం చేయడమూ కూడా కష్టమేనన్నది వైద్యనిపుణుల అభిప్రాయం. ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామ లేమి, జన్యుపరమైన కారణాల వల్ల ఎక్కువగా సంక్రమించే మధుమేహ వ్యాధికి ఆసియా దేశాలే చిరునామాగా మారాయి. అందులోనూ చైనా, ఇండియా, పాకిస్తాన్‌లదే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉండగా, ఒక్క మన దేశంలోనే ఆ సంఖ్య ఏడున్నర కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. అంతెందుకు, పాతికేళ్లలోపు వయసున్న ప్రతి నలుగురిలోనూ ఒకరికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) లెక్కగట్టడం కలవరం కలిగించే విషయమే.
1980లో ప్రపంచవ్యాప్తంగా 10.8 కోట్ల మంది మధుమేహ రోగులు ఉండగా, 2014 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు పెరిగిందంటే ఈ వ్యాధి విస్తరణ ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ మధుమేహ విస్తృతి అంతకంతకూ ఎక్కువవుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్న సంగతి విస్మరించరాని విషయం. టైప్ 5 డయాబెటిస్ ను 1955లో తొలిసారిగా జమైకాలో గుర్తించినట్లు చెబుతున్నారు. దీనిని ఒక విభిన్నమైన మధుమేహంగా 1985లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్ 5 డయాబెటిస్ బారినపడిన వారి సంఖ్య రెండున్నర కోట్లకు పైమాటేనని వైద్యులు చెబుతున్నారు. పోషకాహార లేమి కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్లు వైద్యుల పరిశోధనలలో తేలిన నేపథ్యంలో పేదలే ఎక్కువగా దీనిబారిన పడే ప్రమాదం ఉంటుంది.
వైద్య నిపుణులు చెబుతున్న దానిని బట్టి టైప్ 5 రకం మధుమేహాన్ని గుర్తించేందుకు, నిర్ధారించేందుకు అవసరమైన విధానాలపై విస్తృత పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. మొదటి రెండు రకాలకు ఈ కొత్త రకం తోడై, ప్రజల ప్రాణాలను కబళించక ముందే ప్రభుత్వాలు మేలుకొనడం మంచిది. వైద్య పరిశోధనలకు నిధులు కేటాయించడంతోపాటు ఈ సరికొత్త రకం వ్యాధి గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరం. ఇటీవల చెన్నైలో ఏర్పడిన డయాబెటిస్ బయో బ్యాంకుల వంటివి దేశవ్యాప్తంగా విస్తరించాలి. జీవనమూనాలను సేకరించి ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడంతోపాటు ఐసిఎంఆర్ తోడ్పాటుతో పరిశోధనలు సాగించే బయో బ్యాంకులు మధుమేహంపై యుద్ధం చేయడంలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయడంలో సందేహం లేదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. నియంత్రణే గానీ నివారణ లేని మధుమేహం ముప్పునుంచి భావిభారతాన్ని తప్పించేందుకు పటుతరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.