Wednesday, January 22, 2025

మంత్రి హరీష్ పేరుతో వసూళ్లు.. ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మంత్రి హరీష్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రిసిప్టు బుక్కులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన పేరాల వెంకటేష్ అలియాస్ తెలంగాణ వెంకటేశ్వరరావు రావు అలియాస్ వెంకట్ ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నాడు. బౌరంపేటకు చెందిన గడ్డమీది రాజేష్‌కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేష్ మంత్రి హరీష్ రావు వెంట తిరుగుతుంటాడు. ఈ సమయంలో పలువురు ప్రముఖులు, వ్యాపారులు, ఇండస్ట్రీయలిస్టులు వచ్చి మంత్రిని కలిసేవారు. దీనిని గమనించిన నిందితులు వసూళ్లు చేయాలని ప్లాన్ వేశారు.

హరీష్ అన్న సేవా సమితి పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పుట్టించారు. రిసిప్టు బుక్కులను ప్రింటింగ్ చేయించారు. సేవా సమితి అధ్యక్షుడిగా గుండాల మల్లేష్, ఉపాధ్యాక్షుడిగా నిందితులు వెంకటేష్, జనరల్ సెక్రటరీగా రాజేష్ కుమార్ పేరు ముద్రించారు. అధ్యక్షుడిగా మల్లేష్ పేరు ముద్రించిన విషయం అతడికి తెలియదు. ఈ రిసిప్టు బుక్కులను పట్టుకుని తిరుగుతూ బిల్డర్లు, వ్యాపారులు, పరిశ్రమల నిర్వాహకుల వద్ద నుంచి లక్షలా రూపాయలు వసూలు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఎస్సైలు అశోక్ రెడ్డి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News