వ్యక్తిగతంగా ఆమె అంటే ఎంతో గౌరవమన్న అన్నాడిఎంకె నేత
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆమె అనుంగు నెచ్చెలి వికె శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్ర చేయలేదంటూ సీనియర్ ఐఎఎస్ అధికారులు గతంలో ఇచ్చిన వాంగ్మూలం కరెక్టేనని అన్నా డిఎంకె సీనియర్ నేత ఒ పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత మృతిపై గత తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ముందు మంగళవారం ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. అంతేకాదు వ్యక్తిగతంగా తనకు శశికళ అంటే ఎంతో గౌరవం ఉందని కూడా ఆయన చెప్పారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన పన్నీర్‌సెల్వం శశికళను ‘చిన్నమ్మ’గా అభివర్ణించారు.
2017 ఫిబ్రవరిలో అన్నాడిఎంకె పదవులనుంచి ఒపిఎస్ తప్పుకొన్న తర్వాత దాదాపు నాలుగేళ్ల కాలంలో పన్నీర్ సెల్వం బహిరంగంగా శశికళను ‘చిన్నమ్మ’గాసంబోధించడం ఇదే మొదటి సారి. అన్నాడిఎంకె కేడర్ అంతా కూడా జయలలితను ‘అమ్మ’ గా పిలిస్తే శశికళను చిన్నమ్మగా పిలిచే వారు. కాగా పన్నీర్‌సెల్వం వరసగా రెండో నోజు ఈ కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. విచారణ సందర్భంగా శశికళ తరఫు న్యాయవాది అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వ్యక్తిగతంగా శశికళ అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెప్పారు. అంతేకాదు జయలలిత మృతిపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి అనుమానాలు లేవని మరో ప్రశ్నకు సమాధానంగా పన్నీర్‌సెల్వం చెప్పారు. అయితే ప్రజల అభిప్రాయాల దృష్టా తాను ఆమె మృతిపై దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుకు డిమాండ్ చేశానని చెప్పారు.