శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జెకెఎన్‌పిపి) అధ్యక్షులు ప్రొఫెసర్ భీంసింగ్ మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న సింగ్ తమ నివాసంలో కన్నుమూశారని సన్నిహితులు బుధవారం తెలిపారు. రాజకీయ నేతగానే కాకుండా భీంసింగ్ మానవహక్కుల ఉద్యమకర్తగా, రచయితగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పేరొందారు. 2016లో ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు సీనియర్ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేలాది మంది పేద ఖైదీలు, వ్యవసాయ కూలీలు, యువతకు ఆయన పలు సందర్భాలలో ఉచిత న్యాయసాయం చేశారు. వారి తరఫున వాదించారు. అంతర్జాతీయ వేదికలపై మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు. యాసర్ అరాఫత్, క్యూబా నేత ఫైడల్ కాస్ట్రో వంటి పలువురు నేతల రాజీలేని ఉద్యమాలకు వారి సంఘర్షణలకు మద్దతు నిచ్చారు. 1941 ఆగస్టు 17వ తేదీన పూర్వపు రాజరిక కశ్మీర్‌లోని రామ్‌నగర్ ప్రాంతంలో ఆయన జన్మించారు. పాంథర్స్ పార్టీ పెట్టడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉండేవారు. 1982లో తన భార్య జే మాలాతో కలిసి సొంత పార్టీ ఏర్పాటు చేశారు.