Saturday, November 16, 2024

పాపికొండలలో మళ్లీ పడవ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Papikondalu tourism will resumes soon

మనతెలంగాణ/ హైదరాబాద్ : గోదావరి వరదలతో మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్ది రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఎపి పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఎపి టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గతేడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు.

పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. జూన్ నెలలోనే కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి అనుమతి ఇవ్వడంతో ఉపాధి మెరుగుపడనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News