Thursday, September 19, 2024

బంగారు గనిపై ఘర్షణ.. కాల్పుల్లో 50 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పపువా న్యూగినియాలో పోర్‌గెరా బంగారు గని భూమి అక్రమ ఆక్రమణలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఘర్షణలు ఆదివారం తీవ్ర స్థాయికి చేరి 300 రౌండ్లకు పైగా కాల్పులకు దారి తీశాయి. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 50 వరకు చేరి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన పపువా న్యూగినియా మానవ హక్కుల అధికారి మేతే బగొస్సో సోమవారం వెల్లడించారు. అయితే ఎంతమంది గాయపడ్డారో ఆయన వివరించలేదు. ఈ గని ప్రాంతం లోనే గత మేనెలలో భారీగా కొండచరియలు విరిగిపడి 2000 మంది జీవ సమాధి అయ్యారు. దేశం మధ్య ప్రాంతం లోని పోరెగెరా బంగారు గని భూమిపై వాస్తవంగా పయాండె తెగవారికి హక్కులు ఉన్నప్పటికీ, ఆగస్టు నుంచి సకార్ తెగవారు ఆక్రమించుకోవడంతో ఇరు వర్గాల మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ఈ నేపథ్యం లోని ఆదివారం కాల్పులు జరిగాయి. హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో శనివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు నేషనల్ పోలీస్ కమిషనర్ డేవిడ్ మానింగ్ చెప్పారు.

అక్రమ గని తవ్వకం దారులు,అక్రమ నివాసుల నుంచి పరిస్థితి క్షీణించిందని, స్థానికులను వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. భూ యజమానులు, స్థానికులను భయభ్రాంతులకు గురి చేసేందుకు హింసాత్మక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు . బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను భయపెట్టేందుకు ఆయుధాలను ప్రదర్శించేవారిని కాల్చి పారేస్తామని హెచ్చరించారు. గత 24 గంటల్లో గిరిజన పోరాటం తీవ్రం కావడంతో స్థానిక ఉద్యోగులపై ఆ ప్రభావం పడిందన్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు , స్నేహితులు, గాయపడ్డారు. వీరిలో చాలా మంది హత్యకు గురయ్యారు. భయంతో స్థానిక ప్రజలు నిద్రలేక గడుపుతున్నారు అని న్యూ పోరెగెరా జనరల్ మేనేజర్ జేమ్స్ మెక్ టైమాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘర్షణలను ఆపడానికి భద్రతా దళాలకు అదనపు అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. ఆల్కహాలు విక్రయాలను నిలిపివేసింది. రాత్రివేళల్లో కర్ఫూ విధించింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో అల్లర్లు జరిగేవి. కానీ ఈసారి ఆటోమేటిక్ ఆయుధాలు వాడడం వల్ల పరిస్థితి దిగజారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News