Monday, December 23, 2024

ఈ విజేతలు.. అందరికీ స్ఫూర్తిదాతలు

- Advertisement -
- Advertisement -

కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే సాధించలేనిదేదీ లేదనడానికి పారిస్‌లో మొన్నటితో ముగిసిన పారాలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భారతీయ క్రీడాకారులే తాజా ఉదాహరణ. మున్నెన్నడూ లేనంత భారీ బృందంతో పారిస్‌కు బయల్దేరిన మన ఆటగాళ్లపై మొదట్లో విమర్శలు వినిపించినా, అద్వితీయమైన ప్రతిభాపాటవాలు కనబరిచి, విమర్శకుల నోళ్లకు తాళం వేశారు. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు గెలుచుకుని, ఈసారి 25 పతకాల సాధన లక్ష్యంగా చేసుకున్న భారత సేన పది రోజులకు పైగా సాగిన ఈ క్రీడాంగణంలో అనూహ్యంగా 29 పతకాలను కొల్లగొట్టడం విశేషమే. వీటిలో 17 పతకాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లోనే లభించగా జూడో, ఆర్చెరీ, షూటింగ్, జావెలిన్ త్రో, షాట్ పుట్ తదితర రంగాల్లోనూ మనవాళ్లు సత్తా చాటారు. 1968 టెల్ అవీవ్ పారాలింపిక్స్‌లో తొలిసారి అడుగుమోపిన భారత్‌కు ఈ స్థాయిలో పతకాలు రావడం ఇదే మొదటిసారి.

1972 హీడెల్ బర్గ్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచినా, 2016 వరకూ గెలుచుకున్నవి 12 పతకాలు మాత్రమే. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి మన దివ్యాంగ వీరులు సత్తా చూపడం మొదలైంది. రియోలో నాలుగు, టోక్యో పారాలింపిక్స్ (2020) లో 19 పతకాలు సాధించి, 25వ స్థానంలో నిలబడిన భారత్, తాజా క్రీడల్లో 18వ స్థానానికి ఎగబాకడం చెప్పుకోదగిన శుభపరిణామం. పతకాలు గెలిచినా, గెలువకపోయినా పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరూ అభినందనీయులే, స్ఫూర్తిప్రదాతలే. శారీరికంగా ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, ఆర్థికంగా మరెన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రీడావేదికలపై తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించడమే వారు సాధించిన విజయమని చెప్పితీరాలి. ఇందులో పాల్గొన్న క్రీడాకారులను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కన్నీటి గాథ.

తొమ్మిదేళ్ల వయసులో జరిగిన కారుప్రమాదం నుంచి కోలుకుని షూటింగ్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న అవనీ లేఖరా ప్రస్థానం దివ్యాంగులకే కాదు, సకలాంగులకీ స్ఫూర్తిదాయకమే. పుట్టీపుట్టగానే పోలియో మహమ్మారి బారిన పడిన భవీనా పటేల్ ది మరో విషాదగాథ. ఈ అమ్మాయి కనీసం లేచి కూర్చోవడం కూడా కష్టమేనని డాక్టర్లు పెదవి విరిస్తే, తల్లిదండ్రుల సహకారాన్నే ఊతంగా మలచుకుని, టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఆమెలోని పట్టుదలకు తార్కాణం. కోవిడ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవడం ఇబ్బందిగా మారితే, భర్తతో ఇంట్లోనే రోజుకు తొమ్మిది గంటలు ప్రాక్టీసు చేసిన ఆమె కఠోర దీక్షకు చేతులెత్తి దండం పెట్టొచ్చు. అవకాశం లభిస్తే తమలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీసి సత్తా చాటాలనుకుంటున్న దివ్యాంగులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. వారికి కావలసింది ప్రభుత్వపరంగా కొంత ప్రోత్సాహం, మరికొంత చేయూత. కానీ, ఈ దిశగా ప్రభుత్వాలు చేస్తున్నది కొద్దిపాటి మాత్రమేనని చెప్పకతప్పదు.

దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వడం, అరకొరగా ఉపాధి కల్పన చూపించడమే ఘనకార్యంగా భావిస్తున్న పాలకులు.. ప్రభుత్వ కార్యాలయాల మాట దేవుడెరుగు, ఇప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లోనూ వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ర్యాంపులు, లిఫ్టులు లేని భవంతులలో మెట్లమీద నుంచి పాక్కుంటూ వెళ్లే దివ్యాంగులను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇక వారికి క్రీడా సౌకర్యాలు కల్పించడమనేది పాలకుల దృష్టిలో తలకు మించిన భారం.

ఈ దృక్పథంలో మార్పు వస్తే, మన పారా అథ్లెట్లు మరిన్ని అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి దేశ ప్రతిష్ఠను సగర్వంగా దశదిశలకూ చాటగలరని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రభుత్వమే కాకుండా, కార్పొరేట్ రంగం కూడా దివ్యాంగులకు చేయూతనిచ్చి, వారికి క్రీడావసతులు కల్పించడంపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఇతర అథ్లెట్లను ప్రోత్సహించి సహాయ సహకారాలను అందిస్తున్న తీరుగానే పారా అథ్లెట్లనూ ఆదరించి అక్కున చేర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వారికి తగిన వసతులు, విద్యాలయాల్లో క్రీడావసతులు కల్పించే దిశగా ముందడుగు వేయాల్సిన తరుణమిది. సాధారణ అథ్లెట్ల మాదిరిగానే తమకూ గౌరవం దక్కాలని, దేశం గర్వించేలా చేసే సత్తా పారా అథ్లెట్లకూ ఉందంటూ జావెలిన్ త్రోలో స్వర్ణపతకం గెలుచుకున్న నవదీప్ సింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక సమాజం తమను చిన్నచూపు చూస్తోందన్న ఆవేదన, ఆత్మక్షోభనూ అందరూ అర్థం చేసుకోవాలి. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News