Friday, December 20, 2024

స్వామి నిత్యానంద దెబ్బకు పరాగ్వే మంత్రి పదవి ఊడింది!

- Advertisement -
- Advertisement -

తిమ్మిని బమ్మిని చేయడంలో స్వామి నిత్యానంద సిద్ధహస్తుడు. ఈవిషయం మనకు తెలుసుగానీ, పరాగ్వేదేశానికి తెలియదు కదా. అందుకనే, నిత్యానందను నమ్మి తన పదవి ఊడగొట్టుకున్నాడు పరాగ్వే దేశానికి చెందిన వ్యవసాయ మంత్రి. అసలు విషయం ఏంటంటే, నిత్యానంద ఇండియాలో ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాడు. ఆయనపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ బాధ తట్టుకోలేక ఒక మంచి రోజు చూసుకుని, తట్టాబుట్టా సర్దుకుని దేశం విడిచి పరారయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈక్వెడార్ కు సమీపంలో ఉన్న ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి, అక్కడ కైలాస దేశాన్ని (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) ఏర్పాటు చేశానని ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ఆయనే ప్రధాని కూడా.

నిత్యానంద అంతటితో ఊరుకోలేదు. తన దేశానికి ఒక జెండాను, ఎజెండాను రూపొందించుకున్నాడు. కరెన్సీని, రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఆ మధ్య జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఏకంగా తమ దేశ ప్రతినిధిగా విజయప్రియ అనే మహిళను పంపించాడు. కైలాస దేశానికి ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న విజయప్రియ ఇండియాపై అనేక ఆరోపణలు చేసింది. తమ దేశ ప్రధాని నిత్యానందను ఇండియా సతాయిస్తోందని ఆరోపించింది.

ఈ గొడవ ఇలా ఉంటే, అప్పుడు జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు పరాగ్వే దేశం తరపున హాజరైన వ్యవసాయ శాఖా మంత్రి అర్నాల్డ్ లో చమర్రోకు కైలాస దేశ ప్రతినిధులు గాలం వేశారు. పరాగ్వేకు మౌలిక సదుపాయాల కల్పనలో సహకరిస్తామని, నీటిపారుదల సౌకర్యాల విషయంలో కూడా చేయూతనిస్తామని కైలాస దేశ ప్రతినిధులు చెప్పడంతో, అర్నాల్డో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దేశం ఎక్కడుందో కూడా తెలుసుకోకుండానే ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టేశారు. ఈ విషయం తెలిశాక పరాగ్వేలో పెద్ద దుమారమే లేచింది. కైలాస దేశమనేదే లేదని, ఇది ఒక కుంభకోణమని ఆరోపణలు రావడంతో చేసేది లేక ఆర్నాల్డో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News