23న కోల్‌కతాలో జరిగే తొలి కార్యక్రమానికి ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ దివస్‌గా జనవరి 23న పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మంగళవారం తెలిపారు. నేతాజీ 125 జయంతి సందర్భంగా జనవరి 23న కోల్‌కతాలో జరిగే తొలి ‘పరాక్రమ దివస్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, నేషనల్ లైబ్రరీ మైదానంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ప్రముఖ సభ్యులు, వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ప్రధాని సన్మానిస్తారని పటేల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 200 మంది పటువా కళాకారులు బోస్ జీవిత చరిత్రను 400 మీటర్ల పొడవైన కాన్వాస్‌పై చిత్రీకరిస్తారని ఆయన చెప్పారు.
బోస్ జన్మించిన ఒడిషాలోని కటక్‌లో జరిగే కార్యక్రమంలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొంటారని ఆయన తెలిపారు. 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్ ఎన్నికైన గుజరాత్‌లోని సూరత్ జిల్లా హరిపురా గ్రామంలో మరో కార్యక్రమం జరుగుతుందని పటేల్ తెలిపారు. ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన దాదాపు 26,000 మంది అమర సైనికుల గౌరవార్థం ఒక స్మారకాన్ని నిర్మించాలని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. నేతాజీ 125 జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు కార్యాచరణ రూపకల్పన కోసం ప్రధాని మోడీ అధ్యక్షతన 85 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైనట్లు ఆయన వివరించారు.