ముంబై : నేరస్థుడుగా ముంబై కోర్టు ప్రకటించిన మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గురువారం నగరం లోని క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 11 పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చండీగఢ్ నుంచి వచ్చిన ఆయన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణలో పాల్గొన్నట్టు తెలిపారు. మహారాష్ట్ర లోని వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరంబీర్‌ను అరెస్టు చేయవద్దంటూ సోమవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. తానేమీ దేశం విడిచి వెళ్ల లేదని ఆయన కోర్టుకు తెలియచేశారు. చండీగఢ్ నుంచి విమానం లో ఇక్కడ దిగగానే ఆయన గోరేగావ్ బెదిరింపు కేసులో విచారణ కోసం గురువారం కండేవలి లోని క్రైమ్ బ్రాంచి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్రమాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన తరువాత ఆయన బదిలీ అయ్యారు. మే నుంచి ఆయన విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నట్టు ఆయనపై కేసులు నమోదయ్యాయి. అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనం ఉంచిన కేసులో ముంబై పోలీస్ ఆఫీసర్ సచిన్ వాఝే అరెస్టు అయిన తరువాత పరంభీర్ బదిలీ జరిగింది.