Thursday, January 23, 2025

పెద్దల సమ్మతితోనే ప్రేమ పెళ్లిళ్లపై అధ్యయనం చేస్తాం: గుజరాత్ సిఎం

- Advertisement -
- Advertisement -

మెహసానా(గుజరాత్): రాజ్యాంగపరంగా అనుకూలిస్తే ప్రేమ వివాహాలకు పెద్దల ఆమోదం తప్పనసరి చేయడానికి సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంలోని సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేయిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ప్రేమ వివాహాలకు పెద్దల ఆమోదం తప్పనిసరి చేయాలంటూ పాటిదార్ కులస్తుల నుంచి వచ్చిన డిమాండ్లకు స్పందనగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.

ఆదివారం మెహసానాలో పాటిదార్ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్దార్ పటేల్ గ్రూపు అనే సంస్థ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రేమ పెళ్లిళ్ల కోసం అమ్మాయిలు ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోతున్నారని, దీన్ని అరికట్టడానికి ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకురావడంపై అధ్యయనం చేయించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తనను కోరినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి తప్పనిసరి చేసేందుకు రాజ్యాంగపరంగా అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని అధ్యయనం చేయించాలని ఆరోగ్య మంత్రి తనను కోరినట్లు ఆయన వివరించారు. ఈ అధ్యయనం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందేమో అన్న విషయాన్ని పరిశీలించాలని ఆయన తనను కోరినట్లు భూపేంద్ర పటేల్ తెలిపారు.

కాగా..ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా స్వాగతించారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే తాను మద్దతు తెలుపుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రేమ వివాహాలలో పెద్దలను నిర్లక్షం చేయడం జరుగుతున్న వేళ పెద్దల అనుమతితోనే ప్రేమ వివాహాలు జరిగేలా రాజ్యాంగపరంగా వీలుకల్పించే ఒక వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావించడం హర్షనీయమని ఆయన అన్నారు.

ఇలా ఉండగా..వివాహం పేరిట మోసపూరితంగా లేదా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన శిక్షలు పడేలా గుజరాత్ మత స్వేచ్ఛ చట్టానికి సవరణలను 2021లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సవరించిన చట్టం ప్రకారం ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి దోషి అని తేలితే ఆ వ్యక్తికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విఢించే నిబంధన ఉంది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదంగా ఉండడంతో దానిపై గుజరాత్ హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News