Monday, December 23, 2024

కుమార్తెలపై తల్లిదండ్రుల ఆకాంక్ష..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గ్రామీణ భారతంలో తమ కుమార్తెలు కనీసం గ్రాడ్యుయేట్ వరకైనా చదవాలన్నదే కన్నతల్లిదండ్రుల ఆకాంక్ష అని సర్వే నివేదిక లో వెల్లడైంది. 20 రాష్ట్రాల్లోని మొత్తం 6229 గ్రామీణ కుటుంబాల ఆధారంగా ది స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా 2023 నిర్వహించిన సర్వే వెల్లడించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నివేదికను విడుదల చేశారు. పిల్లల్లో లింగ బేధాన్ని విశ్లేషించినప్పటికీ అభిప్రాయాలు ఒకే విధంగా వెలువడడం విశేషం. ఆడ,మగ పిల్లలైనా చదువు విషయంలో సాంకేతిక , సాధారణ విద్య, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వరకైనా తమ పిల్లలు డిగ్రీలు పొందాలన్న ఆకాంక్ష తల్లిదండ్రుల్లో కనిపించింది. 82 శాతం మంది బాలురు, 78 శాతం మంది బాలికల తల్లిదండ్రులు ఇదే ఆకాంక్ష కనబరిచారు. అర్ధాంతరంగా చదువులు ఆపేసిన మగ పిల్లల్లో నాలుగో వంతు మంది ప్రాథమిక చదువుల్లోనే బడిమానేశారని తేలింది.

అయితే మగ పిల్లల కన్నా ఆడపిల్లల విషయంలో ఇది 35 శాతం వరకు ఎక్కువగా ఉంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత చదువు మానేసిన వారిలో 75 శాతం మంది మగపిల్లలు, 65 శాతం మంది ఆడపిల్లలు ఉన్నారు.గ్రామాల్లో పైచదువులు చదువుకోడానికి తగిన స్కూళ్లు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ట్రాన్స్‌ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ (టిఆర్‌ఐఎఫ్), సంబోధి ప్రైవేట్ సంస్థ కు సంబంధించి డెవలప్‌మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డిఐయు) 6 నుంచి 16 ఏళ్ల గ్రామీణ విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది. పిల్లల్లో 62.5 శాతం మంది తమ తల్లుల పర్యవేక్షణ లోను, 49 శాతం మంది తండ్రుల పర్యవేక్షణ లోను చదువులు సాగిస్తున్నారని తేలింది. ఇంటిదగ్గర తల్లిదండ్రుల ప్రోత్సాహమే పిల్లల చదువులు సాగడానికి కారణం. దీనికి తోడు 38 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలస్కూళ్లలో చదువే కాకుండా ప్రైవేట్ కూడా చెప్పిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు 25.6 శాతం మంది పిల్లలకు తమ పెద్ద తోబుట్టువులే మార్గదర్శకులుగా ఉంటున్నారు. 3.8 శాతం మంది అంగన్‌వాడీల పర్యవేక్షణ లోను, 7.6 శాతం మంది కమ్యూనిటీ టీచర్ల అజమాయిషీలోను చదువుతున్నారు. 64 శాతం మంది పిల్లలు తల్లుల పర్యవేక్షణ లోను, 50 శాతం మంది తండ్రుల పర్యవేక్షణ లోను,26 శాతం మంది ప్రైవేట్ ట్యూటర్ పర్యవేక్షణలో చదువుతున్నారని సర్వే చెబుతోంది.

స్మార్ట్‌ఫోన్ల ప్రభావం
దాదాపు 73 శాతం మంది పిల్లలు రోజూ రెండు గంటలకు తక్కువ కాకుండా స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో గడుపుతున్నారని సర్వే పేర్కొంది. ముఖ్యంగా పెద్ద పిల్లలు స్మార్ట్‌ఫోన్లతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఎనిమిది, ఇంకా పై తరగతి పిల్లల్లో 25.4 శాతం మంది రెండు నుంచి నాలుగు గంటల పాటు స్మార్ట్‌ఫోన్లతోనే ఉంటుండగా, వీరికి భిన్నంగా ఒకటి నుంచి మూడో తరగతి పిల్లలు 16.8 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News