Thursday, December 26, 2024

కన్నుమూసిన కొడుకులతో 15 కిలోమీటర్ల నడక

- Advertisement -
- Advertisement -

భోరున వర్షం, యువతల్లిదండ్రులు కన్నీటి పర్యంతం. కచ్చా రోడ్డు. ఎంత దూరమైనా తరగని అడవి. ఇద్దరి భుజాలపై దుప్పట్లో ఇద్దరు కన్నకొడుకుల శవాలు. ఇంతకు మించిన దీనస్థితి లేని దుస్థితితో వారు 15 కిలోమీటర్ల మేర శవయాత్ర సాగించాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. దంపతులది పట్టిగాన్ కుగ్రామం. అక్కడ ఎటువంటి వైద్య చికిత్సల ఏర్పాట్లు లేవు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఆరేండ్లు, మూడేళ్ల ఈ రామచక్కనోళ్లకు రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దరిదాపుల్లో వారికి చికిత్స అందించేందుకు వీలు లేని స్థితిలో తల్లిదండ్రులు వీరిని అక్కడి పూజారి నాటు వైద్యుడి దగ్గరకి తీసుకువెళ్లారు. ఆయన ఏదో వనమూలికల కాషాయం ఇచ్చి పంపించాడు. దీనిని తీసుకున్న తరువాత పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని జిమ్లాగట్టలోని ఆరోగ్య కేంద్రానికి భుజాన పిల్లలను వేసుకుని తల్లిదండ్రులు ఉరుకులు పరుగులపై సాగారు.

ఉండే చోట ఎటువంటి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం, పిల్లల పరిస్థితితో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో అక్కడికి చేరారు. వైద్యులుపరీక్షించారు. ఇద్దరూ ఎప్పుడో చనిపోయారని , శవాలను తీసుకువచ్చారని తెలిపారు. దీనితో ఈ దంపతుల కన్నీటికి అంతులేకుండా పోయింది. ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్ ఇస్తామని వారికి ఆసుపత్రి వారు చెప్పారు. అయితే అప్పటికే కడుపుకోతతో ఆక్రోశంతో ఉన్న ఈ దంపతులు ఇందుకు నిరాకరించి తిరిగి ఇంటికి బాట పట్టారు. కాలినడకన భుజాలపై శవాలై ఉన్న పిల్లలతో సాగారు. ఇప్పుడు వారికి ఇక బిడ్డలు లేరని తెలిసిన పుట్టెడు దుంఖం మిగిలింది. ఇక్కడికి వచ్చేటప్పుడు బిడ్డలు సజీవం అనుకుంటూ సాగిన ఆశ కొన ఊపిరిగా ఉంది. ఇక్కడి పలు ప్రాంతాలలో ఆసుపత్రి సౌకర్యం లేక పిల్లలు వృద్థులు మృతి చెందారు. అయినా ఇంతవరకూ ఎటువంటి మార్పులేని ఈ ప్రాంతం త్వరలో మహాకూటములు తలపడే మహారాష్ట్రలో నెలకొని ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News