గోషామహల్: అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం… బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడతున్న పసిపాపను తీసుకుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో వైద్యులు పసిపాపకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోని ఏఎంసి వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తరువాత ఇప్పడే వస్తాను, పాపను చూడండి అని పక్కనే మరో పడకపై ఉన్న రోగికి చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. పాప నిద్ర లేచి ఎడవంతో వార్డులోని ఇతర రోగులు సెక్యూరిటీ దృష్టికి తీసుకపోవడంతో వారు అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆమెను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా, ఆడపిల్లని వదిలి వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం పసిపాపను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు.
parents Infant abandoned at Osmania Hospital