న్యూస్‌డెస్క్: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ ఛద్దా త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వదంతులు వినిపిస్తున్న తరుణంలో వీరిద్దరూ బుధవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. ఫోగ్రాఫర్లకు, జర్నలిస్టులకు చిక్కకుండా వీరిద్దరూ హడావుడిగా కారులో జారుకున్నారు. అప్పటికీ కొందరు వీరిద్దరినీ తమ సెల్‌ఫోన్ కెమెరాలలో బంధించారు.
నలుపురంగు దుస్తులు వేసుకున్న పరరిణీతి చోప్రాతో రాఘవ్ కలసి బయటకు వచ్చి ఒకే కారులో ఇద్దరూ వెళ్లిపోయారు. దీంతో వీరిద్దరూ తమ వివాహ వదంతులను నిజం చేసినట్లు అయింది. పరిణీతి, రాఘవ్ ఇటీవల ముంబైలో చక్కర్లు కొట్టడంతో వాదిద్దరి డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. సెలెబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఇంటిని పరిణీతి సందర్శించడంతో పెళ్లి దుస్తుల కోసమే వీరిద్దరూ అక్కడకు వచ్చారని గుసగుసలు వినిపించాయి. తమ మధ్య బంధంపై వారిద్దరూ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. కాగా..ఆప్ నాయకుడు సంజీవ్ అరోరా గత మంగళవారం ప్రేమ బంధం వదంతులపై రాఘవ్ ఛద్దా, పరిణీతిలను శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం.