భారీ ఆశలతో ఒలింపిక్స్ బరిలో భారత్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్) జరుగనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాలు బరిలో దిగనున్నాయి. ఈసారి భారత్ భారీ ఆశలతో పోటీలకు సిద్ధమైంది. టోక్యోలో జరిగిన కిందటి ఒలింపిక్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో ఏడు పతకాలను సాధించింది. పారిస్ గేమ్స్‌లో ఈ సంఖ్యను అధిగమించాలనే పట్టుదలతో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కనీసం పది పతకాలనూ గెలవాలనే లక్షంతో కనిపిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ కోసం 117 మందితో కూడిన అథ్లెట్ల బృందాన్ని భారత్ సిద్ధం చేసింది.
గతంతో పోల్చితే కొంతకాలంగా ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత నిలకడైన ప్రదర్శనను కనబరుస్తోంది. పారిస్‌లో పదికి పైగా పతకాలను సాధించాలనే లక్షంతో ప్రణాళికలు రచించింది. టోక్యో క్రీడల్లో జావెలిన్‌త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. నీరజ్ మరోసారి పసిడి పతకంతో మెరవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. కిందటి ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన భారత పురుషుల హాకీ జట్టుపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒకప్పుడూ ఒలింపిక్స్‌లో వరుస స్వర్ణాలతో అదరగొట్టిన భారత హాకీ జట్టు కొన్నేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది.
సుదీర్ఘ విరామం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించింది. దీంతో భారత హాకీ జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. కనీసం రజత పతకంనైనా భారత్ సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో కూడా భారత్‌కు పతకాలు గెలుచుకునే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ పతకం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంతకాలంగా పురుషుల డబుల్స్ విభాగంలో వీరిద్దరూ అత్యంత నిలకడైన ప్రదర్శనతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు టైటిల్స్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. పారిస్‌లోనూ పతకం గెలవాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు కూడా పతకం గెలవాలనే లక్షంతో ఉంది. కొంతకాలంగా పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న సింధు ఒలింపిక్స్‌లో పతకం గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.
షూటింగ్‌లో పతకాలు ఖాయం!
షూటింగ్‌లో కూడా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. భారత యువ సంచలనం, తెలంగాణ ఆణిముత్యం ఇషా సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ షూటింగ్‌లో ఇషా సింగ్ అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక మహిళల బాక్సింగ్‌లో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ కూడా పతకం గెలుచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే నిఖత్ ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటింది. ఒలింపిక్స్‌లోనూ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రిథమ్ సాంగ్వాన్, ఐశ్వరీ ప్రతాప్ తోమర్, సరబ్‌జ్యోత్ తదితరులపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
షూటింగ్‌లో ఈసారి కనీసం ఐదు పతకాలు వస్తాయని ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరికి కూడా పతకాలు గెలిచే సత్తా ఉంది. ఆర్చరీలో కూడా భారత్ పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. బొమ్మదేవర ధీరజ్, భజన్ కౌర్, దీపిక కుమారి తదితరులకు పతకాలు సాధించే సత్తా ఉంది. రెజ్లింగ్ వినేశ్ ఫొగాట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. టిటి, గోల్ఫ్, టెన్నిస్, బాక్సింగ్, అథ్లెటిక్స్ తదితర విభాగాల్లో భారత్‌కు పతకాలు సాధించే అవకాశాలున్నాయి. ఈసారి పారిస్ క్రీడల్లో భారత్ 117 మందితో బరిలోకి దిగుతోంది. అన్ని సజావుగా సాగితే భారత్ ఈసారి పది పతకాలు గెలుచుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ విషయంలో వీరి అంచనాలు నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.