న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల వాద ప్రతివాదనల మధ్య కొనసాగుతున్నాయి.గురువారం డిఎంకె సభ్యులు కొందరు నినాదాలు రాసిన టీషర్టులు ధరించి ఉభయ సభలకు హాజరు కావడం గందరగోళానికి దారి తీసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో కూడిన టిషర్టులు ధరించి సభలకు రావడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని, సభల గౌరవానికి భంగకరమని హెచ్చరించినా సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్ష సభ్యులు మారలేదు. చివరికి ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
గురువారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష డిఎంకె సభ్యులు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్‌సభకు వచ్చారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ‘ నిబంధనలు, విధానాలతో సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి . కానీ ప్రతిపక్ష పార్టీ లోని కొంతమంది ఎంపీలు నిబంధనలు పాటించడం లేదు. ఇది సరైనది కాదు. ఎంత పెద్ద నాయకుడైనా సభ గౌరవాన్ని తగ్గించే ఇలాంటి దుస్తులు ధరించడం ఆమోద యోగ్యం కాదు” అని ఓం బిర్లా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తూ… సభ్యులు బయటకు వెళ్లి దుస్తులను మార్చుకుని రావాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సభ మళ్లీ ప్రారంభం కాగా అదే వాతావరణం కనిపించింది. అప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్న తెలుగుదేశం సభ్యుడు కృష్ణప్రసాద్ తెన్నేటి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ 2 గంటల తరువాత సభ ప్రారంభమైనా టీషర్టులతోనే డిఎంకె సభ్యులు ప్రవేశించారు. “డీలిమిటేషన్ కోసం తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుంది.” అని నినాదాలు టీషర్టులపై రాసి ఉన్నాయి. “ వ్యవసాయంపై ఈరోజు మనం చర్చించుకోవలసి ఉంది.
అలాంటి ముఖ్యమైన అంశంపై చర్చకు మీరు అవకాశం ఇవ్వడం లేదు. మీరంతా సహకరించి చర్చలు సానుకూలంగా సాగేలా చూడండి అని స్పీకర్ అభ్యర్థించినా సభ్యులు తగ్గలేదు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సభా కార్యకలాపాలు ప్రారంభానికి ముందు డీఎంకే ఎంపీ టి. శివ ‘మాట్లాడుతూ తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్ కోసం పట్టుబడుతోందని , ఇది దాదాపు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని, కానీ ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్ డిమాండ్ చేస్తూ మేము మా నిరసనను కొనసాగిస్తున్నామని చెప్పారు.