Monday, December 23, 2024

పార్లమెంటు సమావేశాల వృథా!

- Advertisement -
- Advertisement -

దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ, ప్రజాస్వామ్య తలమానిక సంస్థ అయిన పార్లమెంటు సమావేశాలు విజ్ఞత, పరిణతతో కూడిన చర్చకు నోచుకొని చాలా కాలమైంది. కీలకాంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య ప్రశాంతమైన వాదప్రతివాదలు జరిగి ఆయా అంశాల లోతులు, వాస్తవాలు ప్రజలకు తెలిసేలా చేసిన సందర్భాలు బహు అరుదు. అదానీ గ్రూపు మోసం బయటపడి దాని షేర్ల విలువ రూ.12 లక్షల కోట్ల మేరకు భారీగా పతనం కావడం, ఆ సంస్థకు ప్రధాని మోడీ అండదండలుండడంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) చేత దర్యాప్తు చేయించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టడం అదే సమయంలో రాహుల్ గాంధీ తన లండన్ ప్రసంగాల్లో భారతీయ ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మాట్లాడారన్న దానిపై ఆయన క్షమాపణలు చెప్పాలంటూ అధికార బిజెపి సభ్యులు డిమాండ్ చేయడంతో మొన్న సోమవారం నుంచి ఈ వారమంతా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి.

ఏ ఒక్క కార్యక్రమం చేపట్టకుండా వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయి. గురువారం నాడు కేవలం 5 నిమిషాల పైచిలుకు సమయమే రెండు సభలూ పని చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కలిసి పార్లమెంటును దట్టమైన చీకటి మందిరంగా మార్చివేశారని విమర్శించడం గమనించవలసిన విషయం. పార్లమెంటు గత సమావేశాల్లో సోనియా, రాహుల్ గాంధీలపై చేసిన విమర్శలకు ప్రధాని మోడీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి కాంగ్రెస్ శుక్రవారం నాడు నోటీసు ఇచ్చింది. గత సమావేశాల్లో మోడీ కాంగ్రెస్‌పై తీవ్రమైన దాడి చేశారు. సోనియా, రాహుల్ గాంధీలు నెహ్రూ పేరును ఇంటి పేరుగా ఎందుకు చెప్పుకోడం లేదని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరా గాంధీలు కలిసి రాష్ట్రాల్లోని కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చడానికి రాజ్యాంగం 356 అధికరణను పదేపదే ప్రయోగించారని దాడి చేశారు.

2021 నాటి పార్లమెంటు తొలకరి సమావేశాలు పెగాసస్ నిఘా వివాదంపై దద్దరిల్లిపోవడంతో కేవలం 21 గం. 20 ని॥ పాటే జరిగాయి. 2022 తొలకరి సమావేశాలు 44 గం. మాత్రమే పని చేశాయి. ఆ సమావేశాలను ముందుగానే ముగించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. పూర్తి సమయం జరగకుండా సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోడం వరుసగా ఏడోసారి అని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ అన్నారు. 2018 ఏప్రిల్‌లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్ధం పూర్తిగా వ్యర్థమైపోయింది. ఇలా పాలక, ప్రతిపక్షాల మధ్య ఏకీభావం కుదరకపోడం వల్ల పార్లమెంటు సమావేశాలు తరచూ ప్రతిష్టంభనకు గురికావడం దేశ ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచి పేరు తీసుకు రాదు. జాతిని సంక్షోభానికి, అపఖ్యాతికి గురి చేసే అంశాలపై వాస్తవాలు చెప్పకుండా పాలక పక్షం తప్పించుకొనే ప్రయత్నం చేయడం వల్లనే పార్లమెంటు అభాసుపాలవుతున్నది.

పాలక పక్షం తమ ప్రశ్నలను పట్టించుకోకుండా వాటికి సరైన సమాధానాలివ్వనప్పుడు ఏదో ఒక విధంగా సభాధ్యక్ష స్థానం దృష్టిని ఆకర్షించడానికి ప్రతిపక్షం సంఘటితంగా ప్రయత్నించడాన్ని అప్రజాస్వామికమని ఎంతమాత్రం అనలేము. అటువంటి సమయాల్లో ప్రతిపక్షం బిగ్గరగా కేకలు వేయడం, వాకౌట్లు చేయడం వంటి వాటి ద్వారా సమావేశాలను అడ్డుకోడాన్ని కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగానే పరిగణించాలని కొంత మంది నిపుణులు అభిప్రాయపడిన సందర్భాలున్నాయి. 2022 జులైలో పార్లమెంటు తొలకరి సమావేశాల్లో 23 మంది ప్రతిపక్ష సభ్యు(19 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు)లను చివరి వరకు సస్పెండ్ చేసినప్పుడు అది ఆ సభ్యుల నోరు నొక్కడం గానే భావించారు. పాలక పక్షం ఏకపక్షంగా బిల్లులను ఆమోదింప చేసుకోడం కోసం ప్రతిపక్షాన్ని బలవంతంగా బయటికి పంపించడం సభ గౌరవానికి హానికరమని అభిప్రాయపడ్డారు.

2011లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వున్న అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ చర్చ జరిగేలా చూడడం పార్లమెంటు విధి అని, కాని చాలా సార్లు పాలక పక్షమే పార్లమెంటును తన సొంత ప్రయోజనాలకు వాడుకొని ప్రజా సమస్యలను నిర్లక్షం చేస్తుందని అటువంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు సభను అడ్డుకోడం ప్రజాస్వామ్యబద్ధమేనని అన్నారు. అందుచేత చట్టసభల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకోడం ఎంత మాత్రం అప్రజాస్వామికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాడు అరుణ్‌జైట్లీ బిజెపిలో వున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బిజెపి పాలక పక్షంగా అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం వంటి అతి ప్రధానమైన అంశంపై జెపిసి వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు అంగీకరించకుండా రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డ మీద అవమానానికి గురి చేశారనే సాకుతో ఎదురు దాడికి దిగుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ప్రతిష్టంభనకు కారణమవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News