న్యూఢిల్లీ: అధికార పక్షం, ప్రతిపక్షం సభ్యుల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయసభలు బుధవారంకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి సమావేశం కాగానే బిజెపి సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు అరుస్తూ నిరసనలు తెలిపారు.
బిజెపి సభ్యులు దేశంలోని ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె, టిఎంసి సభ్యుల అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ఏర్పాటుచేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రధాని మోడీ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఎత్తిచూపుతున్న ప్లకార్డులను కాంగ్రెస్ ఎంపీలు ప్రదర్శించారు. వారు ఆ ప్లకార్డులు పట్టుకుని సభ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇరుపక్షాల నిరసనలు, రణగొణ ధ్వనుల మధ్య రాజ్యసభ మరునాటికి(బుధవారం) వాయిదా పడింది.
లోక్‌సభలో ఏ కార్యక్రమం కొనసాగకుండా ఇలా రెండో రోజు కూడా వృథా అయింది. నెల రోజుల తర్వాత సమావేశమైన పార్లమెంటు ఇప్పటి వరుకు ఏమి చేయలేదు.
ఒకవైపు సభలో గలాభా జరుతున్నప్పటికీ రాజ్యసభ సభా నాయకుడు పియూష్ గోయల్ భారత ప్రజాస్వామ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చేయాలని డిమాండ్ చేశారు. ఇరుపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతుండడంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభను రేపటికి వాయిదా వేశాడు.