న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) డైరెక్టర్ పదవీకాలాన్ని గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లును సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ ప్రవేశపెట్టగా సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ఈ నెల 9న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి వద్దకు పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో బిల్లు చట్టరూపంలో అమలులోకి రానున్నది. ఇప్పటివరకూ ఇడి డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండగా, ఇప్పుడది ఐదేళ్లకు పెరిగింది.
జాతీయ భద్రత, దేశ ఆర్థిక నిర్మాణం సుస్థిరత కోసం ఇడి డైరెక్టర్ పదవీకాలాన్ని పెంచుతూ చట్టానికి సవరణ చేశామని బిల్లును ప్రవేశపెడ్తూ జితేంద్రసింగ్ తెలిపారు. రెండేళ్ల తర్వాత ఒక్కో ఏడు చొప్పున గరిష్ఠంగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేవరకు పొడిగించే అవకాశం నూతన చట్టం ద్వారా లభిస్తుందని సింగ్ తెలిపారు. నగదు అక్రమ తరలింపు కేసుల్లో ఇడి దర్యాప్తు జరుపుతుంది. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష సభ్యుల్లో అధికభాగం సభలో లేకపోవడం గమనార్హం. సస్పెండైన 12మంది సభ్యులకు మద్దతుగా వారు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.
Parliament approves bill to extend ED director tenure up to 5 years