Wednesday, January 22, 2025

పార్లమెంటుకు పొగబెట్టారు

- Advertisement -
- Advertisement -

ప్రకంపనలు సృష్టించిన దుండగుల దుశ్చర్య

లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి దూకి రంగుల పొగ వెదజల్లిన ఓ దుండగుడు స్పీకర్ వేదికవైపు బెంచీలు
దూకుతూ దూసుకెళ్లిన మరో యువకుడు ఇరువురిని అదుపులోకి తీసుకున్న పార్లమెంట్ సభ్యులు..
సెక్యూరిటీ సిబ్బందికి అప్పగింత ఒకరికి దేహశుద్ధి చేసిన ఎంపిలు అదే సమయంలో పార్లమెంట్
ఆవరణలో గ్యాస్ క్యానిస్టర్స్‌తో ఇంకో యువకుడి హల్‌చల్ భద్రతా సిబ్బందిపై గ్యాస్ వెదజల్లిన
ఆగంతకుడు నినాదాలతో హోరెత్తించిన మరో యువతి ఇరువురిని అదుపులోకి తీసుకున్న భద్రతా
సిబ్బంది పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం విచారణకు ఆదేశించిన స్పీకర్
దర్యాప్తు బాధ్యత తనదేనని ప్రకటన 22ఏళ్ల క్రితం ఇదేరోజు పార్లమెంట్‌పై దాడి చేసిన
ముష్కరమూకలు నాటి ఘటనలో 9మంది వీర మరణం ఉదయం.. నాటి అమరులకు నివాళి అర్పించిన
పార్లమెంట్.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దారుణానికి తెగబడిన దుండగులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ప్రజాస్వామిక సమున్నత సౌధం పార్లమెంట్‌లో బుధవారం ఇద్దరు దుండగులు అత్యంత సంచలనాత్మక, నాటకీయ రీతిలో దాడికి య త్నించారు. కలకలం సృష్టించారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తరువాత ఓ వైపు లోక్‌సభలో సమావేశాలు జరుగుతుండగా, జీరో అవర్‌లో విజిటర్స్ గ్యాల రీ నుంచి ఇద్దరు ఆగంతకులు సభలోకి దూకారు. వీరి చేతుల్లో పొగగొట్టాలు ఉన్నాయి. ఈ గ్యాస్ క్యానిస్టెర్స్‌ను తెరిచి సభలో గ్యాస్ వెదజల్లేందుకు యత్నిస్తూ సభ్యుల బల్లల మీదుగా పరుగులు తీశారు. సెకండ్ల వ్యవధిలో పరిస్థితిని గమనించిన సభాధ్యక్షస్థానంలో ఉన్న బిజెపి సభ్యులు రాజేంద్రఅగర్వాల్ హుటాహుటిన సభను వా యిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లోగా దుండగులు నిమిషాల వ్యవధిలోనే సభలోకి పసుపు పచ్చరంగు వాయువును తమ చేతుల్లోని పొగగొట్టాలతో స్ప్రే చేశారు. దీనితో సభ్యులలో అక్కడున్న అధికారులలో కలకలం చెలరేగింది. పరిస్థితిని గమనించి కొందరు ఎంపిలు ఈ యువ దుండగులను అతికష్టం మీద పట్టుకుని, అప్పటికే లోపలికి వస్తున్న భద్రతా సిబ్బందికి అప్పగించారు. యువకులను ఎంపిలు కొందరు చితకబాదారు. ఈ దశలో వీరికి ఎంపిలకు మధ్య తోపులాటలు జరిగాయి. వీరి చేతుల్లోని గ్యాస్ స్ప్రే పరికరాలను ఎంపిలు గుంజుకున్నారు. సభలో తీవ్ర స్థాయి అరాచకానికి దిగుతూ వీరు పెద్ద ఎత్తున నినాదాలకు దిగినట్లు వెల్లడైంది. ఈ నినాదాలు ఏమిటనేవి వెంటనే స్పష్టం కాలేదు

పార్లమెంట్ ఆవరణలో దుండగురాలు

ఓ వైపు లోక్‌సభ గ్యాలరీలోయువకులు గందరగోళానికి దిగుతున్నప్పుడు బయట ఇదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు చేతుల్లో గ్యాస్ క్యానిస్టెర్స్‌తో నినాదాలకు దిగారు. భద్రతా సిబ్బందిపై గ్యాస్‌కొట్టారు. తానాషాహీ నహీ చలేగా (నిరంకుశత్వం పనికిరాదు), నల్లచట్టాలను నిలిపివేయాలి అని నినాదాలకు పాల్పడ్డారు. వీరిని అక్కడున్న భద్రతా సిబ్బంది పట్టుకుని , అదుపులోకి తీసుకుంది. లోక్‌సభలో ఇద్దరు వ్యక్తుల దాడి యత్నం, బయట ఈ ఇద్దరి పట్టివేత దృశ్యాలు అక్కడి సిసిటీవీ కెమెరాలలో నిక్షిప్తం అయ్యాయి. వెంటనే వైరల్ కూడా అయ్యాయి. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్లు పార్లమెంట్ భద్రతా వ్యవస్థ ఉన్నతాధికారులు తెలిపారు. గ్యాలరీలో నుంచి ఆగంతకులు సభలోకి సినిమా ఫక్కిలో దూకడం, వెంటనే దుశ్చర్యకు పాల్పడటంతో గ్యాలరీలోని పలువురు సందర్శకులు కంగుతిన్నారు. ఉరుకులు పరుగులపై బయటకు వెళ్లారు.

పట్టుబడ్డ వారిలో ఇద్దరి గుర్తింపు

లోక్‌సభ లోపల కలకలం రేకెత్తించిన ఇద్దరు యువకుల ఉనికి వెల్లడైంది. వీరు సాగర్ శర్మ, మనోరంజన్ శర్మ అని నిర్థారించారు. వీరు మైసూర్ లోక్‌సభ ఎంపి ప్రతాప్ సింహా అతిధులుగా సభలోకి ప్రవేశించినట్లు విజిటర్స్ గ్యాలరీ రికార్డుల పరిశీలన తరువాత నిర్థారణ అయింది. విజిటర్స్ పాస్ ఇచ్చిన ఎంపి బిజెపికి చెందిన వాడు. సభలో పరిణామంతో లోపల ఉన్న ఎంపీలు భయభ్రాంతులు అయ్యారు. సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో టేపాంతంలో దూకిన యువకులతో భడేలు మంటూ శబ్ధం అయింది. దీనితో సభ్యులు తమ తమ స్థానాల నుంచి లేచి పరుగు తీశారు. లోపలికి దిగిన వారిలో ఒకడు బల్లల మీద గెంతుతూ వెళ్లాడు. మరో వ్యక్తి ఎడమ వైపు నుంచి దూసుకువచ్చి ఛాంబర్‌లోనికి ప్రవేశించాడని సభలో ఆ క్షణంలో ఉన్న ఎంపీలు తెలిపారు. జీరోఅవర్ సాగుతుండగా ఈ ఘటన జరిగింది. సభ మొత్తం పసుపు రంగు వాయువుతో నిండిపోవడంతో సభ రెండు గంటల వరకూ వాయిదా పడింది. కొందరు సభ్యులు బయటకు వచ్చినతరువాత తమకు కళ్లు మండుతున్నాయని, అస్వస్థతగా ఉందని వాపోయారు.

ఇద్దరు లోపల, ఇద్దరు వెలుపల అరెస్టు

ఘటన తరువాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. ఘటన వివరాలు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారు నలుగురు అని, వీరిలో ఇద్దరిని పార్లమెంట్ లోపల, మరో ఇద్దరిని ఆవరణలో పట్టుకున్నారని వెల్లడించారు. ఘటన తరువాత ఆయన సారథ్యంలో సభ జరిగినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దుండగుల వద్ద ఉన్న వస్తువులను స్వాధీనపర్చుకున్నారని, మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారని, సభ్యులు ఆందోళన చెం దవద్దని తెలిపారు. సభ పునఃప్రారంభం తరువాత రెండు గంటల ప్రాంతంలో కొందరు సభ్యులు ఈ విషయం ప్రస్తావించారు.

పార్లమెంట్‌పై దాడికి ఇటీవలి హెచ్చరికలకు ఈ ఘటనకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని, ప్రాథమిక విచారణలో కూడా ఇదే స్పష్టం అయిందని స్పీకర్ తెలిపారు. దుండగుల పూర్వాపరాలు, వారు ఏ సంస్థకు అయినా చెందిన వారా? అనేది స్పష్టం కాలేదు. కెనడాలో పరిణామాల తరువాత ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ హెచ్చరిక చేశారు. ఇందులో ఖలీస్థానీయులు డిసెంబర్ 13 లేదా అంతకు ముందు చర్యకు దిగుతారని తెలిపారు. ఇప్పటి ఘటన దర్యాప్తు క్రమంలో ఉందని, అన్ని విషయాలు ఆ తరువాత నిర్థారణ అవుతాయని సభ్యులకు స్పీకర్ సమాధానం ఇచ్చారు. సభ జరుగుతున్నప్పటికీ పలువురు సభ్యుల్లో ఆందోళన కనపడింది. సభ్యుల ఆందోళనలకు సంబంధించి సభ పూర్తి కాగానే అఖిలపక్షభేటీ ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. కాగా తమకు పట్టుబడ్డ వ్యక్తులలో ఒకరు తాను దేశభక్తుడిని అని, నిరసన తెలిపేందుకు ఈ విధంగా చేస్తున్నాని చెప్పాడని జెడియు ఎంపి రాంప్రీత్ మండల్ తరువాత తెలిపారు. దుండగుడిని ఆర్‌ఎల్‌పి సభ్యులు హనుమాన్ బెణివాల్, మరికొందరు అతికష్టం మీద అడ్డుకుని పట్టుకున్నారు. ఇద్దరిలో ఒక్కడు తరచూ తానాషాహీ నహీ ఛలేగా నినాదాలకు దిగాడని మండల్ తెలిపారు. జీరో అవర్‌లో బిజెపిసభ్యులు ఖగెన్ ముర్మూ మాట్లాడుతున్నప్పుడే ఘటన జరిగింది.

నల్లచట్టాలు వెనక్కి తీసుకోవాలి..నిరంకుశం నశించాలి .. భారత్ మాతాకీ జై, జై భీమ్ జై భారత్ నినాదాలు
సభలో కలకలం రేపిన దుండగులు బిగ్గరగా సభ అదిరిపొయ్యేలా పలు సార్లు నినాదాలకు దిగారు. నిరంకుశం సాగదు . జై భీమ్ జై భారత్ నినాదాలకు దిగినట్లు ఆ తరువాత పోలీసు అధికారి తెలిపారు.

బాంబు పట్టుకుని వచ్చారనుకున్నా : సుదీప్ భట్టాచార్య

సభలో గందరగోళానికి పాల్పడ్డ వ్యక్తుల్లో వింతైన పరికరాలు ఉండటంతో తాము భయకంపితులం అయినట్లు టిఎంసి ఎంపి సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. వీరి చేతుల్లో ఉన్నవి బాంబులా లేక మంటల పరికరాలా? అనుకుని, ఇక ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చునని అనుకున్నామని, వీరి ప్యాకెట్లలోనే పరికరాలు పెట్టుకుని బయటకు తీశారని వివరించారు. గ్యాస్‌తో సభ అంతా నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు. పరిస్థితి గురించి లోక్‌సభ సభ్యులు డానిష్ అలీ కూడా తెలిపారు. ఇది తీవ్ర భద్రతా వైఫల్యం. పార్లమెంట్‌పై దాడి జరిగిన రో జును స్మరించుకుంటున్న రోజే ఈ ఘటన జరిగిందని, ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. దుండగులు ప్రయోగించిన వాయువు విషపూరితం అ యి ఉంటుందని, ఇది ఎక్కువ సేపు సోకితే ప్రాణాపా యం ఏర్పడుతుందని కాంగ్రెస్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. దుండగులు బల్లలు ఎక్కి తిరుగుతూ చివరికి వెల్‌లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారని డిఎంకె సభ్యు లు డిఎన్‌వి సెంథిల్ కుమార్ ఆ తరువాత తెలిపారు. సభలో పూర్తిగా భద్రత లేకుండా పోయిందన్నారు. హోం మంత్రి అమిత్ షా ఉపన్యాసాలు బాగా చెపుతారు కానీ చివరికి పార్లమెంట్‌లోనే భద్రత లేని స్థితిని చూపారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు.

మొత్తం దుండగులు ఆరుగురు… ఒకరు పరారీ

ఇప్పుడు పార్లమెంట్‌లో తీవ్రస్థాయి సంచలనానికి పాల్ప డ్డ వారి సంఖ్య మొత్తం ఆరు అని, వీరిలో ఐదుగురు పట్టుబడ్డారని, ఒకరు పారిపోయినట్లు గుర్తించామని ఓ అధికారి తెలిపారు. ఈ విషయం పూర్తిగా నిర్థారణ కాలే దు. పార్లమెంట్ లోపల దాడికి పాల్పడిన సాగర్‌శర్మ, మనోరంజన్ శర్మగా గుర్తించారు. వెలుపల పట్టుబడ్డ వారిని నీలం దేవి, అమోల్ షిండేగా గుర్తించారు. వీరుఎరుపు, పసుపు గ్యాస్‌ను తమ వద్ద ఉన్న గ్యాస్ స్ప్రేలతో వెదజల్లారు. దాడికి ప్లాన్ చేసిన వారిలో ఐదవ వ్యక్తిని లలిత్ ఝాగా, ఆయన గురుగావ్ వాసిగా గుర్తించారు. ఆరో వ్యక్తిని ఇప్పటికీ గుర్తించలేదు. ఆయన లలిత్ ఝా పరారీలో ఉన్నారు.

స్పీకర్ అఖిలపక్ష సమావేశం

ఘటన తరువాత కొద్దిసేపటికి స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభ్యుల ఆందోళనను అర్ధం చేసుకుంటామని, వీటిని నివృత్తి చేస్తామని తెలిపారు. అయితే దుండగులు వాడిన గ్యాస్ ప్రమాదకరం కాదని, ఈ ఆగంతకులు సంచలనం సృష్టించేందుకు చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత అన్ని విషయాలు వెల్లడవుతాయని, భద్రతా ఏర్పాట్లును మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించారు.
సభలో జరిగిన పరిణామాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు స్పీకర్ ఆదేశించారు. దుండగులను పట్టుకున్న ఎంపిలు, సమయస్ఫూర్తితో వ్యహరించిన భద్రతా సిబ్బందిని, ఛాంబర్ స్టాఫ్‌ను స్పీకర్ అభినందించారు. మార్షల్స్ సకాలంలో స్పందించారని తెలిపారు. ఇప్పుడున్న భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుందని మధ్యాహ్నం నాలుగు గంటలకు సభ ఆరంభంలో చెప్పారు. దీనిపై తాను అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News