న్యూఢిల్లీ : శనివారం బడ్జెట్ సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎన్నికలకు ముందు 17వ లోక్‌సభకు ఇది చివరి సెషన్. నిజానికి శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే ఆర్థిక రంగంపై శ్వేతపత్రం, రామాలయ ప్రాణప్రతిష్టపై చర్చకు సెషన్‌ను మరో రోజు పొడిగించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్లు, నిరసనల నడుమ బడ్జెట్ సెషన్ ముగింపు జరిగింది. కాగా 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులను గత ఐదేండ్లలో ఆమోదించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఇందులో కొన్ని అత్యంత కీలక బిల్లులు కూడా చట్టరూపం పొందాయి.
లోక్‌సభలో చివరి రోజున చర్చ తరువాత ప్రధాని సమాధానం ముగిసిన తరువాత అయోధ్య రామాలయంపై తీర్మానం ఆమోదించారు. తనకు అధికార విపక్ష సభ్యులు సమానం అని, రెండు కళ్లు అని స్పీకర్ తెలిపారు. అయితే సభా మర్యాదల పరిరక్షణకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వివరించారు.. దీనిని అంతా అర్థం చేసుకోవాలని తెలిపారు. తరువాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ కూడా వాయిదా పడింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ స్వల్పకాలికమైనా ఇది కీలక సెషన్ అయిందని వివరించారు. పలు అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు. మొత్తం మీద సభ సంతృప్తికరంగా సాగిందన్నారు.
17వ లోక్‌సభ పార్టీల సంఖ్యాబలాలు.. మొత్తం సభ్యుల సంఖ్య 543
ఇప్పుడు లోక్‌సభలో బిజెపి సభ్యుల సంఖ్య 290. …కాంగ్రెస్ 48..డిఎంకె 24/ టిఎంసి 22/ వైఎస్‌ఆర్‌సిపి 22/ శివసేన 19/జెడియు 16 /బిజెడి 12 /బిఎస్‌పి 10/ టిఆర్‌ఎస్ 8/ ఎల్‌జెపి 6 / ఎన్‌సిపి 5/ సిపిఎం 3/ఇండిపెండెంట్లు 3/ ఐఎంయుఎల్ 3 / ఎస్‌పి 3/ ఎన్‌సి 3/ టిడిపి 3/ మజ్లిస్ 2/ ఆప్నాదళ్ 2/ సిపిఐ 2 ఇతరులు ఉన్నారు .