Friday, January 31, 2025

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వాడి వేడి చర్చలకు అటు ప్రతిపక్షం, దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సంసిద్ధమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతిప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సమర్పిస్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ ఒక విడత, మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. మహా కుంభమేళాలో తొక్కిసలాట, 30 మందికి పైగా మృతి ఘటన పై కచ్చితంగా పార్లమెంటులో చర్చించి తీరాలని ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీర్మానించుకున్నాయి. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై దాడికి దిగాలని కూడా విపక్షాలు సిద్ధమయ్యాయి.

కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లుతో సహా మూడు కొత్త బిల్లులను, మొత్తం మీద బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులకు సభ ఆమోదముద్ర పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఇమిగ్రేషన్, విదేశీయుల బిల్లు మరీ ముఖ్యమైనవి. వక్ఫ్ సవరణ బిల్లుపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుల సంయుక్తకమిటీ చర్చించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తన నివేదికను సమర్పించింది.నిరుడు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ప్రభుత్వం పలు సవరణలతో ఆమోదింపజేసుకునేందుకు సన్నద్ధమైంది. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును కూడా ప్రవేశపెట్టారు ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను సిద్ధం చేసింది అవి విమానాల వస్తువులలో పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకరి విశ్వవిద్యాలయ బిల్లు, ’ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు’. అలాగే 2025 ఫైనాన్స్ బిల్లు, గ్రాంట్స్ ఇతర బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో పది బిల్లులు గత సమావేశాల నుంచీ సభ ఆమోదానికి రెడీగా ఉన్నాయి.

అఖిల పక్షసమావేశంలో గరంగరం..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గురువారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ఉభయసభల్లో ప్రధానంగా చర్చించాలని స్పష్టంచేశాయి.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మేళాలో సామాన్య భక్తులు, యాత్రికులకన్నా… వీవీఐపీలకే పెద్దపీట వేసిందని ఫలితంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.జనవరి 31న పార్లమెంటు సలహా సంఘం సమావేశంలో బడ్జెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేసారు.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై నిర్మాణాత్మక మైన చర్చ జరిగేటట్లు సహకరించాలని ప్రతిపక్షాలకు రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి చేసారు.

సాంప్రదాయం ప్రకారం మొదట పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం, 2025-26 బడ్జెట్ సమర్పణ ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు తాము సభలో చర్చించ దలచిన అంశాలను సభా కార్యక్రమాల నిర్ణాయక కమిటీ (బిఏసీ) లో ప్రస్తావించవచ్చునని కిరణ్ రిజుజు సూచించారు. చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలలో మహా కుంభమేళాలో ఘటన కూడా ఉందని ఆయన అన్నారు. మహా కుంభమేళా దుర్ఘటన పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జుడీషియల్ విచారణ జరిపిస్తోందని మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు వివరించారు.

ఇండియా బ్లాక్ కుంభ మేళా దుర్ఘటన తో పాటు, నిరుద్యోగం, ధరల పెరుగుదల,
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతుల ఆందోళన తో సహా పలు అంశాలను సభలో ప్రస్తావిస్తుందని
కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News