Monday, December 23, 2024

సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.

ఈ నెల 13వ తేదీన(సోమవారం) పోలింగ్ జరుగనుండడంతో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. వాస్తవంగా సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలి..కానీ ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు.

రంగంలోకి అగ్రనేతలు

గడువు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో ప్రచార హోరు పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి, బిఆర్‌ఎస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తరఫున సిఎం రేవంత్‌రెడ్డి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ, మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, హర్‌దీప్ సింగ్, అనురాగ్‌సింగ్ ఠాగూర్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ సీనియర్ నేతలు తమిళిసై, అన్నామళై, రాజస్థాన్ సిఎం భజన్‌లాల్‌వర్మ తదితరులు నగరంలో ప్రచారం నిర్వహించారు.

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత గత నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, అగ్రనేత హరీశ్‌రావు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సభలు, సమావేశాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో మెజార్టీ అభ్యర్థులు కుటుంబ సభ్యులను ప్రచార రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ పార్టీ పజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. చివరి రోజు పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News