తేదీ త్వరలో ప్రకటిస్తాం: ఎస్‌కెఎం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా మే నెల మొదటి పక్షంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) తెలిపింది. రైతులతోపాటు ఈ ప్రదర్శనలో కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, నిరుద్యోగ యువకులు పాల్గొంటారని ఎస్‌కెఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. పార్లమెంట్ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపింది. తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఎస్‌కెఎం 40 రైతు సంఘాలతో ఏర్పడింది.
ఏప్రిల్ 1నుంచి తమ ఆందోళనను తీవ్రం చేయనున్నట్టు ఎస్‌కెఎం తెలిపింది. ఏప్రిల్ 10న 24 గంటలపాటు కెఎంపి ఎక్స్‌ప్రెస్‌వేను దిగ్బంధించనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 5న ఎఫ్‌సిఐ బచావో దివస్, 14న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం, మే 1న కార్మికుల దినోత్సవం నిర్వహించనున్నట్టు ఎస్‌కెఎం తెలిపింది. పార్లమెంట్ మార్చ్‌ను బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఫిబ్రవరి 1న నిర్వహించాలని ఎస్‌కెఎం మొదట నిర్ణయించింది. అయితే, రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలతో దానిని వాయిదా వేసింది.