Saturday, November 16, 2024

దిక్కులేని పార్లమెంటు!

- Advertisement -
- Advertisement -

ప్రాణ హానికి, ప్రాణ భయానికి పెద్ద తేడా లేదు. భయంలేని వాతావరణం స్థిరంగా ఏర్పడడమే మానవాళి కోరుకొనే అతి గొప్ప స్థితి. దానిని సాధించలేనంత కాలం నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధించనట్టే భావించాలి. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటు కొలువు దీరివున్న సమయంలో బుధవారం నాడు ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి సృష్టించిన భయోత్పాతం అత్యంత ఆందోళనకరమైనది. ఎందుకిలా జరిగిందని పలు కోణాల్లో శోధించవలసిన ఘటన ఇది. సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దుమికి రంగు పొగ విడిచిపెట్టిన ఈ సన్నివేశం అత్యంత దురదృష్టకరమైనది. పార్లమెంటు కొత్త భవనానికి పూడ్చవలసిన కంతలున్నాయని చాటుతున్నది. దాని భద్రత వ్యవస్థను బోనులో నిలబెడుతున్నది.

ఐదంచెల దుర్భేద్యమైన భద్రత వున్నదని చెప్పుకొనే పార్లమెంటు ధీమాను పటాపంచలు చేసి దేశ ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించిన ఈ పరిణామం మూలాలను పూర్తిగా లోప రహితంగా తెలుసుకోవాలి. అందులో బయటపడిన లోపాలను నిర్మూలించి ఇక ముందైనా మన పార్లమెంటుకు ఇటువంటి అభద్రతాయుత వాతావరణం తలెత్తకుండా చూడాలి. జరిగిన దాని గురించి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయమున్నట్టు వారిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అందరూ 30 ఏళ్ళ లోపు వారేనని వారిలో ఒకరు ఇంజినీరింగ్ చదువుకొన్నారని చెబుతున్నారు. స్పీకర్‌కు పోలీసులు ప్రాథమిక సమాచారం అందించారని తెలుస్తున్నది. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరిలో ఒక వ్యక్తి సభ్యుల బల్లల మీది నుంచి దాటుకొంటూ స్పీకర్ వైపు వెళబోయిన దృశ్యం ప్రసారమైంది.

అప్రమత్తులైన ఎంపిలు కొందరు ధైర్యం చేసి ఆ ఇద్దరినీ పట్టుకొన్నారని తెలుస్తున్నది. 22 ఏళ్ళ క్రితం పాత పార్లమెంటు భవనంపై ఉగ్రమూక విఫల దాడి సరిగ్గా ఇదే తేదీన జరిగింది. భద్రత సిబ్బంది సకాలంలో స్పందించి ఆ దాడిని వమ్ము చేశారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ రెండు ఘటనలూ ఒకే తేదీన సంభవించడం యాదృచ్చికమా లేక రెండింటి మధ్య సంబంధం ఏమైనా వున్నదా అనేది తేలవలసి వుంది. బుధవారం నాటి ఘటనలో పాల్గొన్న వారి ఉద్దేశం అలజడి సృష్టించడమేనని తేలినట్టు చెబుతున్నారు. రంగు పొగ దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు సాధికారికమైన ప్రవేశ పత్రాలు (పాస్‌లు) సంపాదించి పార్లమెంటు లోపలికి చొరబడడం మామూలు విషయం కాదు. వారు విష వాయువు చల్లివుంటే అదెంతటి ముప్పును తెచ్చిపెట్టేదో ఊహిస్తేనే చెప్పనలవికాని భయం కలుగుతుంది.

అలా జరగనందుకు హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నాము గాని జరిగే అవకాశాలున్నాయనే చేదు వాస్తవాన్ని కప్పిపుచ్చలేము. ఐదెంచెల భద్రత వ్యవస్థ వున్న చోట ఆగంతకులు అందరి కళ్ళుగప్పి ఎలా లోపలికి చొరబడగలిగారు? వారి అనుమతి పత్రాలకు సిఫార్సు చేసింది కర్నాటకకు చెందిన బిజెపి ఎంపియేనని తేలింది. అందుచేత ఆ పాస్‌లను భద్రత సిబ్బంది అనుమానించడానికి ఆస్కారం లేదు. కాని వారి వద్ద వున్న పొగ గొట్టాలను అత్యాధునిక నిఘా యంత్రాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి? ఆ యంత్రాలను సిబ్బంది వినియోగించనేలేదా? ఇది సాధారణమైన నిర్లక్షం కాదు. ఈ ఘటన జరిగింది కాబట్టి కొద్ది రోజుల పాటు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆ తర్వాత షరా మామూలే! భద్రత వైఫల్యం ఈ ఉదంతంలో ఒక కోణానికి సంబంధించింది కాగా, ఆ ఆరుగురు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పథక రచన చేశారు అనేది మరింత ముఖ్యమైన కోణం. సభ లోపల వారు నియంతృత్వం నశించాలి అని నినాదం ఇచ్చినట్టు తెలుస్తున్నది. అలాగే ఈ ఆరుగురు ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వారు కాదు.

కర్నాటక, హర్యానా, మహారాష్ట్ర వంటి వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఆన్‌లైన్ సంబంధాలు పెట్టుకొని ఈ దాడికి వ్యూహ రచన చేసుకొన్నట్టు అర్థమవుతున్నది. తమ ప్రాణాలకే ముప్పు కలిగించగల ఈ సాహసానికి వొడిగట్టడం వెనుక వారికి గల ఆలోచన ఏమిటనేది సమగ్రంగా తెలుసుకోవలసి వుంది. దేశంలో నిరంకుశ పాలనా ధోరణులు ప్రబలుతున్నాయని భావించి వారు ఇందుకు సమకట్టారా, వారి వెనుక ఏదైనా సంస్థ పాత్ర వుందా అనేవి తెలియవలసి వున్నాయి.ఈ ఆరుగురిలో ఒకరు గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు నిరసనోద్యమంలో పాల్గొన్నారని సమాచారం.అదే నిజమైతే ఆ ఉద్యమ లక్ష్యాల సాధన కోసం వీరు ఇందుకు పాల్పడ్డారేమో తెలుసుకోవాలి.ఇటువంటి ధోరణులు ప్రబలడానికి దేశంలోని ఏ పరిస్థితులు దోహదం చేస్తున్నాయో చిత్తశుద్ధితో శోధించి తెలుసుకోవలసిన అవసరం దేశ ప్రజల మంచి భవిష్యత్తు దృష్టా అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News