Monday, January 20, 2025

ఇక సిఐఎస్‌ఎఫ్ పరిధిలో పార్లమెంట్ భద్రత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఇటీవల సంభవించిన భద్రతా వైఫల్యాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ భవన సముదాయానికి సంబంధించిన సమగ్ర భదత్రను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి(సిఐఎస్‌ఎఫ్) అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. విమానాశ్రయాల తరహాలో ఇక పాత, కొత్త పార్లమెంట్ భవన సముదాయాలలో భద్రతా ఏర్పాట్లను సిఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తుంది. పార్లమెంట్‌లోకి ప్రవేశించే వ్యక్తులను చేతి డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తారు. అదే విధంగా వారి బ్యాగులు, ఇతర వస్తువులను ఎక్స్ రే మిషన్లతో తనిఖీ చేస్తారు. వారి షూస్, హెవీ జాకెట్స్, బెల్టులను ఒక ట్రేలో ఉంచి వాటిని స్కానర్‌లోకి పంపడం ద్వారా తనిఖీ చేస్తారు. ఇది వరకు పార్లమెంట్ సముదాయంలో సందర్శకులను ఢిలీ పోలీసు సిబ్బంది తనిఖీ చేసేవారు. ఈ నెల 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

లోక్‌సభ జీరో అవర్‌లో విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్‌పైకి దూకి స్మోక్ బాంబులను ప్రయోగించారు. నిందితులలో ఒకరు షూస్‌లో స్మోక్ బాంబులను షూస్‌లో దాచి లోపలకు తెచ్చాడు. సిఐఎస్‌ఎప్ భద్రతా సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని సమగ్ర భద్రతా విధానంలో ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ భవన సముదాయాన్ని సర్వే చేయవలసిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ భవన సముదాయ సమగ్ర భద్రతను సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు వారు చెప్పారు. పార్లమెంట్‌కు చెందిన భద్రతా సిబ్బందికి కూడా సందర్శకులను, వారి వస్తువులను తనిఖీ చేయడంపై సిఐఎస్‌ఎఫ్ కేంద్రంలో శిక్షణ అందచేస్తారని వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News