Wednesday, January 22, 2025

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్

- Advertisement -
- Advertisement -

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్
ఆగస్టు 11 వరకూ 17 సిట్టింగ్‌లు
పాత భవనంలో ఆరంభం మధ్యలో కొత్త సదనంలోకి
సజావు సభలకు సహకరించి ఫలితాలు అందించాలి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ
ఈసారి యూనిఫామ్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్‌లు?
ఇప్పటికే వివాదాస్పదం అయిన రెండు అంశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆరంభమవుతాయి. ఆగగస్టు 11 వ తేదీ వరకూ సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం తెలిపారు. పార్లమెంట్ సెషన్ సజావుగా సాగేలా, ఫలప్రద చర్చల ఫలితాలు వెలువడేలా చూడాల్సి ఉందని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ పాతభవనంలోనే ఆరంభం అవుతాయి. కొత్తగా ఏర్పాటు అయిన పార్లమెంట్‌లోకి ఆ తరువాత సెషన్ మారుతుంది. మే 28 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. దీనిని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త భవనంలో పార్లమెంట్ సెషన్ కొంచెం ఆలస్యంగానైనా జరగడం ఇదే తొలిసారి అవుతుంది. ఓ వైపు దేశంలోని విపక్షాలు రాబోయే ఎన్నికలకు ముందు బిజెపికి వ్యతిరేకంగా కలిసికట్టుగా వ్యూహాత్మకంగా సాగాలని నిర్ణయించుకున్న దశలో ఈ సారి పార్లమెంట్ సెషన్ తదనుగుణంగా వాడిగావేడిగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇటీవలే ప్రధాని మోడీ దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరగా దీనిని అమలులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. ఈసారి పార్లమెంట్ సెషన్‌లోనే సివిల్ కోడ్ బిల్లు ప్రతిపాదించేందుకు వీలుందని వార్తలు వెలువడ్డాయి. పాత పార్లమెంట్‌లో ఆరంభమయి, కొత్తపార్లమెంట్‌కు మారే ఈ సెషన్ మొత్తం మీద 23 రోజుల పాటు సాగుతుంది. 17 సిట్టింగ్‌లు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు. ఈ సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం అత్యంత వివాదాస్పదమైన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చేందుకు వీలుంది. కేంద్ర ప్రభుత్వానికి , ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి మధ్య ఈ ఆర్డినెన్స్ చిచ్చు రగిల్చింది.

దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ తరఫున ఇతర విపక్షాల మద్దతు కూడగట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పర్యటించారు. దేశ రాజధానిలోని అధికారుల సేవలు సంబంధిత విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఈ ఆర్డినెన్స్ చెల్లనేరకుండా చేయడం, న్యాయవ్యవస్థకు, చట్టసభల అధికారాల మధ్య నెలకొని ఉన్న వివాదాన్ని మరింత రాజుకునేలా చేస్తోంది. దేశంలో పరిశోధనలకు సంబంధించిన నిధి ఏర్పాటు బిల్లు కూడా ఈ సారి సభలో ప్రవేశపెట్టే వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News