Saturday, November 23, 2024

ప్రజాకర్షక పద్దు!.. నేటి నుంచి పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

ఆదాయ పన్నుల్లో ఉపశమనం
కిసాన్ సమ్మాన్ నిధి పెంపు
గృహనిర్మాణాలకు చేయూతనిచ్చే అవకాశాలు 
ఉభయసభలను హోరెత్తించనున్న కన్వర్ యాత్ర, నీట్ వివాదం, ప్రశ్నపత్రాల లీకేజీ
అంశాలు అఖిలపక్షం భేటీలో డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టిన కాంగ్రెస్ 
ప్రత్యేక హోదా డిమాండ్లు

న్యూఢిల్లీ : నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ వర్షాకాల బడ్జె ట్ సమావేశాలు మొదలు కానున్నాయి. మంగళవారంనాడు ఆర్థి కమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం ప్రజాకర్షక విధానాలవైపే మొగ్గుచూప బోతున్నట్టు తెలిసింది. ఆదాయపన్నుల్లో ఉపశమనం, కిసాన్ సమ్మాన్ నిధి, ఇళ్ల నిర్మాణాలకు ఊతమిచ్చే విధంగా నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆదివారం అఖిలపక్ష స మావేశం జరిగింది. ఇందులో సంఘటిత ప్రతిపక్షాలు పలు కీలక విషయాలను ప్రభుత్వం ముందుంచాయి.

ప్రత్యేకించి నీట్ వివాదం, పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్ వంటి విషయాలపై సభలలో చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే అని ప్రతిపక్షాలు పట్టుపట్టా యి. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలో ఆహారశాలల ఏర్పాటుపై వెలువరించిన ఉత్తర్వుల విషయం కూడా తాము లేవనెత్తుతామని ప్రతిపక్షాలు తెలిపాయి. కీలక అంశాలపై ఖచ్చితంగా నిలదీయడం జరుగుతుందని ఈసారి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంకేతాలు వెలువరించాయి. ఇక ప్రభుత్వం సభా నిర్వహణలో అందరి మద్దతు అవసరం అని, సెషన్ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ మాట్లాడారు.

సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఇంతకు ముందు పద్ధతికి భిన్నంగా ఈసారి అఖిలపక్షానికి ప్రభుత్వం పలు చిన్న, ప్రాంతీయ పార్టీలను కూడా ఆహ్వానించింది.సమావేశంలో ఏకంగా 44 పార్టీల నేతలు పాల్గొన్నారు. చివరకు ఒకే ఒక్క ఎంపి స్థానం ఉన్న పార్టీలకు కూడా ఆహ్వానం పంపించారు. ఆయా పార్టీలన్నింటితో రాజకీయ అనుసంధానానికి సంకేతాలు వెలువరించింది. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధం అని, అయితే ఏదైనా కూడా సభా నిబందనలకు అనుగుణంగా ఉంటుందని, వీటిని అంతా పాటించాల్సిందేనని ప్రతిపక్ష నేతలకు మంత్రి తెలిపారు. సభ అందరిదీ, సమిష్టి సహకార వైఖరితోనే నిర్ణీత రీతిలో సభలు నిర్వహించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్, జెడియు, ఆప్, ఆర్జేడీ ఇతర పార్టీలు తమ వైఖరిని చాటాయి.

ప్రత్యేక హోదాల అంశం ప్రస్తావన
ఈసారి సమావేశంలో బిజెపి మిత్రపక్షం అయిన జెడియు , తటస్ట పార్టీ బిజెడి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమతమ రాష్ట్రాలు అంటే బీహార్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక కేటగిరి హోదా అవసరం అని తెలిపాయి. బీహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో తాము సభలో ఖచ్చితంగా తీవ్రస్థాయిలోనే పట్టుబడుతామని నితీష్ నాయకత్వపు జెడియు చెప్పడం కీలకం అయింది. ఈ అంశంపై సభలలో చర్చకు అనుమతించాలని మూడు పార్టీలు కోరాయి. బీహార్‌కు స్పెషల్ కేటగిరి డిమాండ్‌కు ఆర్జేడీ కూడా మద్దతు తెలిపింది.

డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి
సభలో సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు వదిలిపెట్టాల్సి ఉందని కాంగ్రెస్ నేత కె సురేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్పీకర్ పదవిని అధికార పక్షం కైవసం చేసుకున్నందున ప్రతిపక్షాలకు కూడా సభలో సరైన విధంగా ప్రాతినిధ్యం కల్పించేందుకు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు వదిలిపెట్టాల్సి ఉందని తాము కోరినట్లు ఈ నేత ఆ తరువాత విలేకరులకు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం, ఆరని మణిపూర్ జ్వాల, రైలు ప్రమాదాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలు కూడా తమ ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయని వివరించారు. యుపిఎస్‌సి నిర్వహించిన పరీక్షలలో అక్రమాలు విద్యార్థుల భవితకు ముప్పుగా మారుతున్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఇటీవలే వ్యక్తిగత కారణాల పేరిట యుపిఎస్‌సి ఛైర్‌పర్సన్ పదవి నుంచి వైదొలిగిన విషయాన్ని కూడా సురేష్ ప్రస్తావించారు. అసలు దేశంలో ఉన్నత విద్యకు కీలకమైన పరీక్షల విధానాలకు ఏమైందని ప్రశ్నించారు.

యుపి ప్రభుత్వ నేమ్‌ప్లేట్ల వివాదాస్పద నిర్ణయం
కన్వర్ యాత్ర దశలో మార్గమధ్యంలో హోటల్స్ , టిఫిన్ బండ్లు సంబంధిత ఓనర్ల పేర్లను బోర్డులపై పొందుపర్చాలని యుపి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులు కూడా వివాదాస్పదం అయ్యాయి. దీనిపై కాంగ్రెస్, ఆప్ , డిఎంకు వంటి పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇటువంటి చర్యలు దేశంలో మతపరమైన వైషమ్యాలకు దారితీస్తాయని, దీనిపై సభలో చర్చించాల్సి ఉందని తెలిపారు. యుపి ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా ముస్లింలను టార్గెట్‌గా చేసుకుని తీసుకున్నదే అని సమాజ్‌వాది పార్టీ ఎంపి రామ్‌గోపాల్ యాదవ్ విమర్శించారు. బిజెపి యుపిలో తన రాజకీయ స్వార్థంతో మతపరమైన విభజన ద్వేష రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా యుపి సర్కారు వైఖరిని తప్పుపట్టాయి. తమ నేత కేజ్రీవాల్‌ను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బిజెపి కేంద్రీయ దర్యాప్తు సంస్థలను వాడుకొంటోందని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. తప్పుడు అభియోగాలతో ఆయన జైలు పాలుచేశారని, దీనిపై కూడా తాము సభలో ప్రస్తావిస్తామని వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో ఢిల్లీకి కేవలం రూ 350 కోట్లు కేటాయిస్తున్నారని, ఇది తొమ్మిదేళ్లుగా సాగుతోన్న తంతు అని, ఈసారి కూడా ఇదే లెక్క ఉంటుందని విమర్శించారు. నీట్ వైద్య పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, దీనిపై తాము సభలలో ప్రస్తావిస్తామని డిఎంకె తరఫున ఎంపి తిరుచి శివ తెలిపారు.

సభకు తరచూ ఆటంకాలేం పద్ధతి: నిలదీసిన రాజ్‌నాథ్ సింగ్
సభలలో తమ ఉనికిని చాటుకోవడానికే ప్రతిపక్షం గందరగోళానికి దిగితే ప్రయోజనం ఏముంటుందని ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని సమాధానాన్ని కూడా ప్రతిపక్షాలు ముందుకు సాగనివ్వకుండా చేశాయని విమర్శించారు. గత సెషన్ ఈ లోక్‌సభ సమావేశాల ఆరంభ ఘట్టం అని, అప్పుడు తలెత్తిన ఆటంకాలు ఇక ముందు జరగకుండా చూడాలని ప్రతిపక్షాలకు పిలుపు నిచ్చారు. అఖిల పక్ష సమావేశంలో వివిధ పార్టీల నుంచి 55 మంది నేతలు పాల్గొన్నారు.

ఈసారి బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ , కేంద్ర యువ మంత్రి చిరాగ్ పాశ్వాన్ వంటి వారు కూడా వచ్చారు. మూడు గంటల పాటు వాడివేడిగా సాగిన అఖిలపక్షం ఇక పార్లమెంట్ సెషన్ ఏ విధంగా సాగుతుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈసారి అఖిలపక్షానికి టిఎంసి హాజరు కాలేదు. కోల్‌కతాలో ఆదివారం జరిగే అమరవీరుల దినం నేపథ్యంలో తాము తీరిక లేకుండా ఉన్నందున రాలేకపోతున్నట్లు తెలిపారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వచ్చిన తరువాత కక్షపూరిత రాజకీయాలు పెరిగాయని, రాష్ట్రంలో అరాచకం తలెత్తిందని అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించారు.

ఈసారి ఇండిపెండెంట్లు మినహా అన్ని పార్టీల వారిని సమావేశానికి పిలువడం ప్రత్యేకతను సంతరించుకుంది. సెషన్ దశలో తిరిగి సెంట్రల్ హాల్‌ను తెరవాల్సి ఉందని పార్టీలు కోరాయని, దీని వల్ల ఎంపిలు ముచ్చటించుకునేందుకు వీలుంటుందని అంతా తెలిపినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ బడ్జెట్ సెషన్ సోమవారం ఆరంభమై 19 సిట్టింగ్‌లతో ఆగస్టు 12 వరకూ జరుగుతుంది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతారు. సభల ప్రారంభం రోజునే ఎకనామిక్ సర్వే వెలువడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News