న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) బిల్లు పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) అధికార బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సభ్యులు ప్రతిపాదించిన అన్ని సవరణలను సోమవారం ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సవరణను కమిటీ తిరస్కరించింది. క్లాజుల వారీగా వోటింగ్ జరిగింది. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ జగదంబికా పాల్ విలేకరులతో మాట్లాడుతూ, కమిటీ ఆమోదించిన సవరణలు చట్టాన్ని మరింత మెరుగుపరుస్తుందని, మరింత సమర్థమైనదిగా చేస్తుందని చెప్పారు. అయితే, ప్రతిపక్ష ఎంపిలు సమావేశం సాగిన తీరును ఆక్షేపించారు. జగదంబికా పాల్ ప్రజాస్వామిక ప్రక్రియను ‘వక్రీకరించారు’ అని వారు ఆరోపించారు.
‘ఇది ప్రహసనప్రాయం. మా అభిప్రాయాలు వినలేదు. పాల్ నియంతలా వ్యవహరించారు’ అని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కల్యాణ్ బెనర్జీ విలేకరులతో చెప్పారు. అయితే, ఆ ఆరోపణను పాల్ తిరస్కరించారు. మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా సాగింది. మెజారిటీ అభిప్రాయాలు నెగ్గాయి’ అని పాల్ తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన అత్యంత గణనీయమైన సవరణల్లో ఒకటి ఏమిటంటే& ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను ‘వినియోగదారు ద్వారా వక్ఫ్’ కారణాలపై ప్రశ్నించజాలరు. అది ప్రస్తుత చట్టంలో ఉన్నది. ఆ ఆస్తులను మతపరమైన అవసరాలకు వినియోగిస్తున్న పక్షంలో దానిని కొత్త వెర్షన్‌లో తొలగిస్తారు. కొన్ని సవరణలు కొన్ని పాత్రల కోసం జిల్లా మేజిస్ట్రేట్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడాన్ని, వక్ఫ్ ట్రైబ్యునళ్ల సభ్యులనుఇద్దరి నుంచి ముగ్గురికి పెంచడాన్ని అనుమతిస్తాయి.
బిల్లులోని 14 క్లాజుల్లో ఎన్‌డిఎ సభ్యులు ప్రవేశపెట్టిన సవరణలను ఆమోదించినట్లు కమిటీ చైర్మన్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యులు 44 క్లాజుల్లో వందలాది సవరణలు ప్రవేశపెట్టినట్లు, వాటిని కమిటీ తిరస్కరించినట్లు జగదంబికా పాల్ చెప్పారు. ముసాయిదా నివేదికను మంగళవారం (28) కల్లా పంపిణీ చేయనున్నట్లు, బుధవారం దానిని లాంఛనంగా ఆమోదించనున్నట్లు జెపిసి ప్రకటించింది. వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిరుడు ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శీతాకాల సెషన్‌లోనే బిల్లును ప్రవేశపెడతారని భావించారు. కానీ విస్తృత పరిశీలన కోసం జెపిసికి నివేదించారు.