Sunday, December 22, 2024

చర్చ లేకుండా కీలక చట్టాలను ఆమోదించుకోవడం కోసమే సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ తీవ్ర విమర్శ

న్యూఢిల్లీ: పార్లమెంటులో పెద్ద సంఖ్యలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. సభల్లో అర్థవంతమైన చర్యల లేకుండా చట్టాలను ఆమోదించుకునేందుకే ఈ సస్పెషన్ అంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడడం దేశ ప్రజలు వినకూడదని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకే సస్పెండ్ చేయడం, బయటికి గెంటేయడం అనే విధానాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు.

‘పార్లమెంటునుంచి మొత్తం 141 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేయడం ఈ నియంతృత్వ బిజెపి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటోందన్న మా ఆరోపణకు బలం చేకూరుస్తోంది. పౌర హక్కులను హరించి వేసి, తిరుగులేని అధికారాలను కట్టబెట్టే క్రిమినల్ చట్ట సవరణలు లాంటి కీలక బిల్లులు సభలో చర్చకు రానున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ బిల్లులపై చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్షాల మాట్లాడడాన్ని ఈ దేశ ప్రజలు వినకూడదని మోడీ ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకనే వాళ్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఈ సస్పెన్షన్ల నాటకానికి తెరదీశారు’ అని ఖర్గే ఓ ట్వీట్‌లో ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

పార్లమెంటులో తీవ్రమైన భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని, దానిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పూ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలోకి ఇద్దరు చొరబడడానికి వీలు కల్పించిన బిజెపి ఎంపి నిర్దోషిగా బయటపడడం కోసమే అధికార బిజెపి ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సైతం ఓ ట్వీట్‌లో దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News