Monday, January 20, 2025

ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 4నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, టిఎంసి నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరిక్ ఒ బ్రియాన్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ( ఎన్‌సిపి) నేత ఫౌజియా ఖాన్ సహా 23 పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపైనచర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే సభలో చర్చలకు అనువైన వాతావరణం ఉండేలాచూడాలని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4నుంచి 22 వరకు జరగనున్నాయి. మోడీ 0.2 ప్రభుత్వానికి ఇవే చివరి శీతాకాల సమావేశాలు కావడం గమనార్హం.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచి జరగనున్న ఈ సమావేశాలపై ఆ రాష్ట్రల ఫలితాల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో 19 బిల్లులను, రెండు ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాలు సభలో చర్చించనున్నట్లు జోషీ తెలిపారు. పేదలకోసం అనేక పథకాలను తీసుకువచ్చాం… అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన చివరి సెషన్ ఇది. నిర్మాణాత్మక చర్చ జరిగేలా తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని అన్నారు. కాగా చైనా మన భూభాగాన్ని లాగేసుకోవడంపైన, మణిపూర్ హింస. ధరల పెరుగుదల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి), కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ)ల దుర్వినియోగంపైన సమావేశంలో ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు ప్రమోద్ తివారీ చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తీసుకువచ్చే బిల్లుల్లో ్ల జమ్మూ, కశ్మీర్, పుదుచ్చేరిలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు,

బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)స్థానంలో తీసుకువచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లులతో పాటుగా 2023-24ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరుగుతుంది. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ నివేదికను కూడా సమావేశాల తొలి రోజే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికను సమర్పించిన తర్వాత ఆమెపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం కోరనున్నుట్ల తెలుస్తోంది. అయితే మొయిత్రాపై ఏదయినా చర్య తీసుకోవడానికి ముందు నైతిక విలువల కమిటీ నివేదికపై సభలో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశం సందర్భంగా టిఎంసి నేతలు డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News