పిఎఫ్ వడ్డీ రేటు కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న ఐక ప్రతిపక్షం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం (నేటి) నుంచి పున ః ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ధర లు వంటి కీలక పరిణామాల తరుణం లో పార్లమెంట్ సెషన్ తిరిగి ఆరంభం అవుతోంది. నిరుద్యోగం, ఉద్యోగుల పి ఎఫ్ వడ్డీ రేట్లలో కోత వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. ఉ క్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల సురక్షి త తరలింపు విషయంలో ప్రభుత్వం నుంచి తగు సమాధానాలు రాబట్టేందుకు విపక్షం సన్నద్ధం అయింది. ఇప్పటివరకూ ఆపరేషన్ గంగ ప్రక్రియలో భాగంగా భారతీయుల తరలింపు , ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు గురించి ప్రతిపక్షాలకు తగు వివరణ ఇచ్చుకోవడానికి ,ఈ విధంగా తమ ప్రతిష్ట పెంచుకోవడానికి అధికార పక్షం సిద్ధం అయింది. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్‌ను సభ ముందుంచుతారు.
దీనిపై భోజన విరామం తరువాత చర్చ జరుగుతుందని సభా కార్యక్రమాల అజెండాలో తెలిపారు. రాజ్యాంగ ( ఎస్‌టి) ఆర్డర్ (సవరణ) బిల్లును కూడా ప్రభుత్వం సభ ఆమోదానికి తీసుకువస్తుంది. కొవిడ్ పరిస్థితిలో క్రమేపీ మెరుగుదల కన్పిస్తూ ఉండటంతో విరామ అనంతర బడ్జెట్ సెషన్‌లో ఉభయ సభలు వేర్వేరుగా ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి. ఇంతకు ముందు సభలు షిఫ్ట్ పద్ధతిలో సాగాయి. యుపి ఇతర రాష్ట్రాలలో బిజెపి విజయం, పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ యుపిలో కేవలం రెండు స్థానాలు దక్కించుకోవడం, పంజాబ్‌లో ఓటమి చెందడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి సభలో అధికార పక్షం తమ ఘనతను చాటుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పార్లమెంట్ బడ్జెట్‌సెషన్ తొలి దశ జనవరి 29వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభల నుద్ధేశించి సంయుక్త ప్రసంగం చేయడంతో మొదలైంది. తరువాత ఆర్థిక సర్వే వెల్లడి , ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు బడ్జెట్ సమర్పించడం జరిగింది.
ప్రతిపక్ష సమన్వయంపై సోనియా చొరవ
సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్ పునః ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు నివాసంలో సమావేశం జరిగింది. సభలో పార్టీ వ్యూహాల బృందం భేటీ ఆమె అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఇతర ప్రతిపక్షాలతో సమన్వయం, అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటి అంశాలు గురించి సోనియా ఈ బృందంతో సమీక్షించారు. భావసారూప్య పార్టీలతో సభలో కలిసి పద్ధతి ప్రకారం వ్యవహరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నామని, ఉక్రెయిన్ , ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలను ప్రస్తావిస్తామని సీనియర్ నేత ఖర్గే విలేకరులకు తెలిపారు. శనివారమే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పిఎఫ్ వడ్డీరేట్లలో కోత విధించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలు వివరణలు కోరనున్నాయి.