రెండు భాగాలుగా బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
ఏప్రిల్ 8న సమావేశాల ముగింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 11 వరకు జరుగుతుంది. రెండవ భాగంలో తిరిగి మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీన ముగుస్తాయి. జనవరి 31న బడ్జెట్ సమావేశాల ప్రారంభం నాడు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. 2022—23 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. రాజ్యసభ 256వ సమావేశాలు(బడ్జెట్ సమావేశం 2022) జనవరి 31న ప్రారంభమవుతాయని, ప్రభుత్వం నిర్ణయించే సభా కార్యకలాపాల మేరకు ఏప్రిల్ 8న ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు సెక్రటరీ జనరల్ శుక్రవారం ప్రకటించారు.
సమావేశాల కాలంలో ఫిబ్రవరి 11న సభను వాయిదావేసి తిరిగి మార్చి 14న సభను పునఃప్రారంభించవలసిందిగా రాజ్యసభ చైర్మన్‌ను ప్రభుత్వం కోరుతుందని ఆయన తెలిపారు. హోలీ సందర్భంగా మార్చి 18న సభ సమావేశం కాదు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం రాజ్యసభలో కేంద్ర వార్షిక బడ్జెట్ 2022–23ను ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలా ఉండగా..ఇటీవలే 400 మంది పార్లమెంట్ సిబ్బంది కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. దీంతో రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ పరిస్థితిని సమీక్షించి కొవిడ్ నిబంధనల మేరకు పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించడంపై ఒక ప్రణాళిక రూపొందించారు.