Monday, December 23, 2024

రాజ్యాంగ నియమాలకు చెల్లు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ పరిపాలనా వైఖరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన అంగాలు మూడు. అవి 1. పార్లమెంటు, 2. కార్యనిర్వహక శాఖ, 3. న్యాయ శాఖలుగా ఉన్నాయి. రాజ్యాంగంలో ఇవి వాటి నిర్దేశిత విధులను సమన్వయంతో నిర్వహిస్తూ పాలన సాగించాలి. అయితే వాస్తవ రాజకీయ కార్యనిర్వాహక శాఖ (రియల్ ఎగ్జిక్యూటీవ్), పార్లమెంట్‌లో మెజారిటీ పార్టీ నుండి మంత్రి వర్గంగా ఏర్పడుతుంది. ఆ మంత్రి వర్గానికి నాయకుడు ప్రధానమంత్రి. ఆయన అభీష్టం మేరకే మంత్రి వర్గం ఏర్పడుతుంది. పేరుకు కేబినెట్ మంత్రి వర్గం పార్లమెంటుకు బాధ్యత వహించినా మంత్రి వర్గంలో ప్రధాన మంత్రే అన్ని విషయాల్లో చక్రం తిప్పుతాడు. సిద్ధాంత రీత్యా ప్రధాని, సమ స్థాయిలో కేబినెట్ మంత్రుల సహచరుడు మాత్రమే. వారంతా ఉమ్మడిగా దేశ పాలనకు సంబంధించిన కీలక విధానపరమైన నిర్ణయాలు ప్రజాస్వామ్యయుతంగా చర్చించి, చివరికి మెజారిటీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం తీర్మానాలను ఆమోదిస్తారు. కానీ, ఆచరణలో కేబినెట్‌కు అధ్యక్షుడుగా ఉండే ప్రధానమంతి అభిప్రాయమే అంతటా చెల్లుబాటు అవుతుంది.

ప్రధానిని ధిక్కరించిన ఎంత గొప్పవారైనా ఆయన అభిప్రాయాలతో విభేదించి మంత్రులుగా కొనసాగలేరు. వారు స్వయంగా రాజీనామా చేస్తారు లేదా బర్తరఫ్ చేయబడతారు.ప్రధానమంత్రి పదవి సహజంగానే శక్తివంతమైనది. అందుకే ‘డీమానిటైజేషన్’ లాంటి కీలక నిర్ణయాలను కూడా మంతిమండలికి తెలియకుండా ప్రధాని నిర్ణయం తీసుకొని టివిలో ప్రకటించే వరకు ఎవరికీ విషయం తెలియదు. తరువాత ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది (అది వేరే విషయం). ఇప్పుడు అసలు విషయానికి వస్తే కార్యనిర్వాహక శాఖలో (రాజకీయ నిర్ణయాలను తీసుకొనే మంత్రి వర్గంతో పాటు) వాటిని ఆచరణలో అమలు పరిచే ఉద్యోగ బృందం కూడా అంతర్భాగం. (వీరు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయటమే కాకుండా వాటిని రూపొందించడంలో కూడా ప్రభుత్వ ఉన్నత శ్రేణి అధికారుల పాత్ర ఉంటుంది. వీరు ఐఎయస్ వంటి ఉన్నత చదువులతో పాటు సీనియార్టీతో సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ పదవులలో ఉంటారు) వీరు నిర్ణీత విద్యార్హతలు, శిక్షణ, నైపుణ్యం గల శాశ్వత ఉద్యోగులు. సుమారు 35- 40 సంవత్సరాల పాటు పదవీ విరమణ పొందే వరకు వివిధస్థాయిల్లో ఉద్యోగులు విధి నిర్వాహణ చేస్తారు. రాజకీయ నాయకులు వస్తారు, పోతారు. కానీ ఉద్యోగులు అలా కాదు.

వారి విధి నిర్వాహణ చట్టబద్ధంగా, రూల్స్‌ను, రెగ్యులేషన్స్‌ను తూచతప్పక పాటించాలి. ప్రధాని చెప్పినా, ఇతర మంత్రులు చెప్పినా వారు చట్ట నియమాలు అతిక్రమించరాదు.ప్రభుత్వ ఫైల్స్‌పై వారి సంతకం, ఆమోదం తెలుపుతూ లేదా తిరస్కరిస్తూ నోట్‌ను, రూల్స్‌ను కోట్ చేస్తూ ఫైల్ పై రాయాల్సి ఉంటుంది. ఆ ఫైల్‌కి సంబంధించిన పూర్తి బాధ్యత సంబంధిత అధికారిదే. ఒకవేళ ఏదైనా విషయంలో అవినీతి లేదా పాలనా నిర్ణయాలలో అవకతవకలు జరిగితే కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత అధికారిదే. శిక్షలు వారే అనుభవించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారులలో కొందరు బదిలీలకు భయపడి లేదా ప్రమోషన్ల కోసం లేదా అక్రమ సంపాదన కోసం రాజకీయ నాయకులకు అణగిమణగి ఉంటారు. వీరు పాలనాపరమైన రూల్స్‌ను అతిక్రమించైనా సరే మంత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకుల అవినీతికి వీరి సహకారం తప్పక అవసరముంటుంది. రాజకీయ నాయకులతో విభేదిస్తే కలిగే సర్వీస్ సంబంధిత సమస్యలను ఉద్యోగులు ఎదుర్కోవలసి ఉంటుంది. అందు కే అధికారులు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటూ, వారి అక్రమాలకు పరోక్షంగా తప్పుడు సలహాలు, సూచనలను ఇస్తూ వారితో లాలూచీ పడతారు.

అమెరికా ఎన్నికలలో ఎవరు అధ్యక్షుడుగా ఎన్నికైతే, అతని పార్టీ విధానాలకు అనుకూలంగా పని చేసే అధికారుల (ఉద్యోగ) బృందాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ, అవకాశం అతనికి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా క్రమంగా అమెరికాలో వున్న విధానాన్నే రూపొందిస్తున్నట్లు కనపడుతున్నది. చట్టబద్ధ పాలనకు భిన్నంగా అధికార యంత్రాంగాన్ని పార్టీ విధానాలకు, తన అభీష్టానికి లోబడి ఉండేలా తయారు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా చట్టాన్ని, నియమావళిని పాటించే అధికార యంత్రాంగాన్నంతా ప్రస్తుతం రాజకీయమయం చేయడం వల్ల పరిపాలన ఏకపక్షంగా కొనసాగుతుంది. ఇలాగే పరిపాలన కొనసాగితే, కొంత కాలానికి అధికారులలో నీతి, నిజాయితీ, నిష్పాక్షిక, సమర్థవంతమైన పాలన కనుమరుగయ్యే ప్రమాదముంది. అధికారుల స్థాయి పార్టీ కార్యకర్తల స్థాయికి మార్పు చెందే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ నియమాలకు విరుద్ధమైనది. కేవలం ఎమెర్జెన్సీ సమయంలో మినహా మిగతా సమయంలో పాలనా వ్యవస్థ అనేది, పారదర్శకంగా చట్టాన్ని పాటిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహించాలి. ఇటీవల పార్లమెంటులో పాసైన ‘ఢిల్లీ సర్వీసుల చట్టం’ ప్రకారం అధికారులు రాజ్యాంగ నియమాలకు భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంది.

న్యాయ వ్యవస్థపైన (న్యాయమూర్తుల నియామకం విషయంలో ‘కొలీజియం’ విషయంలో) తలెత్తిన సమస్యలు. అలాగే ఢిల్లీలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ అధికారులపై పాలనాపరమైన నియంత్రణా అధికారాలను తగ్గిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా పాలన జరిగే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు విశేష పాలనా అధికారాలను కట్టబెట్టడం. గతంలో ఆచరణలో వున్న చట్టాలను సవరించటం. రాజకీయ నాయకుల, పరిపాలనాధికారుల ఆధిపత్యానికి మద్దతుగా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పైన కేంద్ర ప్రభుత్వ పెత్తనం చెలాయించటం రాజ్యాంగ విరుద్ధ చర్య లే. ఈ చట్టం ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. రాజ్యాంగం ఏడవ షెడ్యూల్లోని రెండవ జాబితా ప్రకారం సివిల్ సర్వీస్ అధికారులను అదుపు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి అధికారాలను తొలగించి, ఈ చట్టం ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి, హెూం సెక్రటరీకి కట్టబెట్టడం చెల్లుబాటు అవుతుందా? సుప్రీంకోర్టు తుది తీర్పు ఏలా ఉంటుందో వేచిచూడాలి.

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఆర్ధికంగా లబ్ధి చేకూరేలా అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలల్లో ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు, బొగ్గు గనులు, విద్యుదుత్పత్తి కేంద్రాల వంటి జాతీయ సంపదను అదానీకి అప్పగించటంలో చట్టబద్ధతను భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఏమి తేల్చనుందో. దీనిలో ఉన్నత అధికారులు చట్టాన్ని పాటించారా రాజకీయ జోక్యం వల్ల ‘డుడూ బసవన్నలు’ అయ్యారా! సుప్రీంకోర్టు తేల్చాలి. గతంలో బొగ్గు గనుల కేటాయింపు వివాదంలో అధికారులు జైలు పాలైన విషయం ఉన్నత అధికారులు మరిచిపోతే ఎలా? బ్యాంకులను మోసం చేసి ప్రజాధనం లూటీ చేసిన గుజరాత్ గజదొంగలు చేసిన రూ. 12.51 లక్షల కోట్ల రుణాలను, వాటి వడ్డీలను ఎలా మాఫీ చేశారు? సంబంధిత బ్యాంక్ మేనేజర్లు, ఇతర అధికారుల పై రాజకీయ జోక్యం వెలుగులోకి రావాల్సి వుంది. పైగా ఆ ఆర్ధిక నేరగాళ్ళకే తిరిగి బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వాలనీ ఎవరు బ్యాంకు అధికారులపై వత్తిడి తెస్తున్నారో వెలుగులోకి రావాల్సి వుంది. ఈ ఆర్ధిక నేరగాళ్ళను ఎలా సుప్రీంకోర్టు శిక్షిస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎగవేతదారుల నుండి ప్రజాధనం తిరిగి బ్యాంకులకు ఎలా తెప్పించగలదో చూడాలి.

తనకు అనుకూలంగా పని చేసే ఉన్నత స్థాయి అధికారులు రిటైర్ అయినా ఏళ్ళ తరబడి పదవీ కాలాన్ని పొడిగిస్తూ పదవుల్లో కొనసాగేలా చేస్తున్నారు. ఈ అధికారులు చవకగా, విస్తారంగా దేశంలో లభించే బొగ్గును ఉపయోగించకుండా అదానీ కంపెనీలకు లాభాలు చేకూరేలా విదేశాల నుండి బొగ్గను అధిక ధరలకు కొనేలా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలపై వత్తిడి చేస్తున్నారు. ఇడి, ఐటి, సిబిఐ మొదలైన సంస్థలలో పని చేసే అధికారులు బిజెపి చెప్పినట్లు నడుచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను, విపక్ష ప్రజాప్రతినిధులను బెదిరించడానికి పలుసార్లు దాడులు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్ని రంగాలలో ఉన్నత శ్రేణి అధికారుల చట్టాల అతిక్రమణలపై జుడీషియల్ విచారణ జరిపించి నిజాలను నిగ్గును తేల్చాలి. రాబోయే ఎన్నికల్లో విపక్షాల ఐక్య కూటమి అధికారంలోకి వస్తేనే ఈ కలలు సాకారం అవుతాయి. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News