Wednesday, January 22, 2025

మొదటిసారి సమావేశం కానున్న “ఇండియా” పార్లమెంటరీ పార్టీ నాయకులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్తగా ఆవిర్భవించిన ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూసివ్ అలయన్స్(ఇండియా)లోని భాగస్వామ్య పక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులు గురువారం మొట్టమొదటిసారి సమావేశం కానున్నారు.

గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై వీరంతా కలసి చర్చించి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఒక గంట ముందుగా ప్రతిపక్ష కూటమికి చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులందరూ ఖర్గే నివాసంలో సమావేశం అవుతారని వర్గాలు వెల్లడించాయి.

తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన అనంతరం వీరంతా అధికారికంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. అయితే ఇండియా కూటమిలోని 26 పార్టీలలో కొన్నిటికి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేదు. పార్లమెంట్‌లో సమన్వయంతో అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.

మణిపూర్ సమస్యను ప్రధాన అంశంగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం నుంచి సీనియర్ అధికారుల నియంత్రణను తప్పిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టే బిల్లు వోటింగ్‌ను ప్రతిపక్షాలు సమైక్యంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు, మణిపూర్ విధ్వంసం అవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం, ధరల పెరుగుదల, నిరుద్యోగిత, విద్వేష ప్రచారం, దళితులు, ఆదివాసీలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, కుల గణన తదితర అంశాలను ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో ఉమ్మడిగా ప్రశ్నించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News