న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటి నిబంధనల ఆచరణకు సంబంధించి ట్విటర్ నుంచి సరైన స్పందన రావడం లేదని ప్రభుత్వం పరిగణిస్తూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈనెల 18 సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. డిజిటల్ వేదికలపై పౌరుల హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, ఆన్‌లైన్ వార్తల దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై వివరణ ఇవ్వాలని ఈమేరకు ప్రణాళికతో ట్విటర్ ప్రతినిధి హాజరు కావాలని కమిటీ కోరింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకుని డిజిటల్ స్పేస్‌లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విటర్ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకుంటామని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది. కొత్త నిబంధనలను తక్షణం అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ఇటీవలనే తుది నోటీసు జారీ చేసింది. లేఖలు రాసింది. అయినా ట్విటర్ నుంచి సరైన స్పందన రాలేదు.
అయితే కొత్త నిబంధనలు పాటిస్తామని గత వారంలో ట్విటర్ హామీ ఇచ్చింది. భారత చట్టాల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని, భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా ట్విటర్ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం కలిగిస్తోంది. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్‌కు చెందిన వారిని నియమించక పోవడంతో కేంద్రం ట్విటర్ వైఖరిని తప్పుపడుతోంది.
Parliamentary Standing Committee summons to Twitter