Monday, December 23, 2024

రాష్ట్రానికి స్పెషల్ ఫార్మా ల్యాబ్

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎక్కడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ స్థాపనకు ముందుకొచ్చిన ఇంగ్లండ్ సంస్థ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఇంగ్లాండ్‌కు చెందిన సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ఏర్పాటుచేయబోతుంది. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఈ ల్యాబ్ లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్ పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్ ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, గ్లోబల్ ఛానల్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ డానియల్ విల్లాలోబోస్, లండన్‌లోని ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ కుతుబుద్దీన్‌లు సమావేశం అయ్యారు. తమ కంపెనీ ప్రణాళికలు, పరిశోధనలను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్‌లో తమ అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఏర్పాటుచేయడానికి కారణమని సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ చెప్పారు. తమలాంటి కంపెనీల పెట్టుబడులకు ఇండియా ఆకర్షణీయ గమ్యస్థానమన్నారు.పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ (హైదరాబాద్) భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ ల్యాబ్ తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. తమ కంపెనీకి యునైటెడ్ కింగ్‌డమ్ తో పాటు జర్మనీ, అమెరికా, చైనా , ఇండియాలో యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అపార నైపుణ్యంగల శాస్త్రవేత్తలు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలు ఉన్న నగరంలో తమ ల్యాబ్ ను ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు.

ఫార్మాలో హైదరాబాద్‌ది తిరుగులేని ఆధిపత్యం…కెటిఆర్

హైదరాబాద్ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్‌కు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ల్యాబ్ ను ఏర్పాటుచేయడం…… ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. ఫార్మాలో దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

తొలిరోజు యుకె పర్యటనలో మంత్రి బిజీబిజీ

తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యుకెలో మంత్రి కెటిఆర్ పర్యటన తొలిరోజు బిజీబిజీగా కొనసాగింది. మొదటి సారిగా యుకెలో పర్యటిస్తున్న ఆయన తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు పరిచయం చేశారు. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేండ్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణలో వ్యాపార వాణిజ్య అవకాశాలను కెటిఆర్ వివరించారు. ప్రధానంగా టిఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు తెలియచేశారు.

రాష్ట్ర వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి,నీళ్లు విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కెటిఆర్, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్‌లో మాత్రమే ఉందన్నారు. ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు అవార్డులను హైదరాబాద్ అందుకున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్‌సైన్సెస్- ఫార్మా, బయోటెక్నాలజీ, ఎరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ఒక హాబ్ గా మారిందని తెలిపారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని ఆయన కెటిఆర్ గుర్తుచేశారు.

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఈ సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న ఆయన తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. డెలాయిట్, హెచ్‌ఎస్‌బిసి, జెసిబి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో మంత్రి కెటిఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

కెటిఆర్‌కు ఘనస్వాగతం

యునైటెడ్ కింగ్‌డమ్, దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యుకెకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, పలువురు స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు పర్యటనకు వచ్చిన మంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో సైతం విమానాశ్రయానికి చేరుకుని కెటిఆర్‌కు పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రితో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. కాగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News