హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ పార్టీలు త్వరలోనే కొంతమంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలలో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారైనప్పటికీ ఆషాడం కావడంతో జాబితాను వెల్లడించలేదు. సోమవారంతో ఆషాయం ముగియంతో త్వరలోనే ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో అని అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ పొందేందుకు అభ్యర్థులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక పార్టీ అభ్యర్థిని చూసి మరో అభ్యర్థి ఖరారు?
ఆషాడం ముగిసిన నేపథ్యంలో ఎప్పుడైనా వివిధ పార్టీల నుంచి అభ్యర్థులకు సీట్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పార్టీ కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మిగిలిన ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలలో సామాజిక సమీకరణలు, అభ్యర్థి ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో అభ్యర్థికి ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా బిఆర్‌ఎస్ పార్టీ మొదటి జాబితా వెలువడనున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులకు మొదటి దశలో టికెట్లు ఖరారు చేసి, ఆ తర్వాత మిగతా స్థానాలపై బిఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అయితే బిఆర్‌ఎస్ పార్టీ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
టికెట్ రాని నేతలు పార్టీ మారకుండా జాగ్రత్తలు
ప్రధాన రాజకీయ పార్టీలలో ప్రతి నియోజకవర్గం నుంచి కొంతమంది అభ్యర్థులు టికెట్లు ఆశిస్తుంటారు. అయితే మొదటి జాబితా వెలువడిన తర్వాత టికెట్లు ఆశించిన వారి పేర్లు లేకపోతే ఆ నేతలు పార్టీ మారే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి జాబితా విడుదలకు ముందే ఆయా నియోజకవర్గాలలో టికెట్లు ఆశించిన నేతలందరితో అధిష్టానం చర్చించి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన అభ్యర్థులకు ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ ఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది..? తదితర అంశాలపై ఇప్పటికే అంతర్గతంగా వివిధ రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహించుకున్నాయి. ఈ సర్వే రిపోర్టులతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించిన తర్వాత నియోజకవర్గాలవారీగా ముఖ్యనేతలతో చర్చించి, అనుకూల, వ్యతిరేక అంశాలపై సమీక్షించి ఆయా నియోజకవర్గాలలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానానికి నమ్మకంగా ఉన్న రెండవ శ్రేణి నాయకత్వంతో ఈ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అభ్యర్థులతో చర్చిస్తే వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధినాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వంతోనే పూర్తి సమాచారాన్ని స్వీకరించి వ్యూహాలు రచించినున్నట్లు సమాచారం. మండలాలవారీగా పార్టీ బలాలను అంచనా వేస్తూ గ్రామ స్థాయి నుంచి అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేయనున్నారు.