రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనేది సామెత. దానిని ఇప్పుడు ‘అధికార పార్టీకి తలచుకోకుండానే డబ్బుల వెల్లువ’ అని మార్చి చెప్పుకోవలసి ఉంది. 201920 ఆర్థిక సంవత్సరంలో ఎలెక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకందిన మొత్తం విరాళాల్లో 76.17 శాతం (రూ. 276.45 కోట్లు) ఒక్క భారతీయ జనతా పార్టీకే అందాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎడిఆర్) తాజా నివేదిక ఈ సమాచారాన్ని అందించింది. ఎలెక్టోరల్ ట్రస్టులు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ఆధారంగా ఎడిఆర్ ఈ వివరాలు సేకరించింది. మొత్తం నిధుల్లో 15.98 శాతం (రూ. 58 కోట్లు) ఒకప్పటి రాజవైభోగ పార్టీఅయిన కాంగ్రెస్‌కు అందాయి. రాజకీయాల్లో ప్రాధాన్యాలు తారుమారైనప్పుడు పార్టీల చీకటి వెలుగుల దృశ్యానికి వాటికి ఎదురైయ్యే సుస్థితి, దుస్థితులకు ఇది దర్పణం. కాంగ్రెస్ తర్వాత ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) మూడో స్థానంలో ఉంది. దానికి ట్రస్టుల ద్వారా రూ. 11.26 కోట్లు అందాయి.
కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించి పార్టీలకు అందజేయడానికి నమోదు చేసుకున్న ట్రస్టులు 21 కాగా, వాటిలో 14 మాత్రమే ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించాయి. ఇందులో సగమే పార్టీలకిచ్చిన విరాళాల వివరాలు నివేదికలకెక్కించాయి. ట్రస్టులకు అందిన మొత్తం విరాళాలు రూ. 363.51 కోట్లు కాగా, పార్టీలకు అందినది రూ. 362.91 కోట్లు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సుస్థిరమైన అధికార దండాన్ని చేజిక్కించుకున్నప్పటి (201314) నుంచి దానికి నిధులు అపారంగా అందుతున్నాయి. వద్దంటే డబ్బు, కాదంటే కాసులు అన్నట్టు ఉంది దాని పరిస్థితి. ఆ పార్టీ సిరి శిఖరం మీద విహరిస్తున్నది. విరాళ దాతల పేర్లు బయటికి చెప్పనవసరం లేకుండా అత్యంత గోప్యంగా ఉంచే ఎలెక్టోరల్ బాండ్ల పద్ధతిలో నిర్ణీత వ్యవధిలో పార్టీలకు విరాళాలందించే ఘోరమైన అనైతిక ద్వారం తెరుచుకున్న తర్వాత 201718 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 222 కోట్ల మేరకు ఈ మార్గంలో విరాళాలు అందగా, అందులో 95 శాతం (రూ. 210 కోట్లు) బిజెపి ఖాతాకే చేరాయి.
దానితో ఆ పార్టీ ఎన్నికల నిధి కిమ్మత్తు రూ. 989 కోట్లకు చేరింది. 201617 నుంచి ఏటా రూ. 1000 కోట్లు సమీకరిస్తూ వచ్చిన బిజెపి పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక్క 201819 సంవత్సరంలోనే రూ. 2410 కోట్లు పోగు చేసుకోగలిగింది. ఇందులో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చింది రూ. 1450 కోట్లు కాగా, మిగతాది ట్రస్టుల ద్వారా సంక్రమించినట్టు సమాచారం.
టాటాల ప్రూడెంట్ ఎలెక్టోరల్ ట్రస్టు ఒక్కటే రూ. 356 కోట్లు సమర్పించుకున్నది. ఇదే ట్రస్టు కాంగ్రెస్ పార్టీకి రూ. 55 కోట్లిచ్చింది. 201718 లో బిజెపి ఖర్చు రూ. 758 కోట్లు కాగా, ఆ మరుసటి సంవత్సరం (201819) లో అది రూ. 1005 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఎన్నికల సంవత్సరం కావడం వల్ల దాని వ్యయం ఆమేరకు పెరిగిందని భావించాలి. ఇందులో ఎన్నికల కోసం రూ. 792 కోట్లు ఖర్చు చేసినట్టు బిజెపి వెల్లడించింది. ఈ మొత్తంలో సగానికి పైగా అంటే రూ. 435 కోట్లు ప్రకటనలు, ప్రచారం కింద పెట్టినట్టు తెలియజేసింది. పెద్ద పెద్ద కంతలను కప్పిపెట్టి, గోరంతలను మాత్రమే లెక్కలకు ఎక్కించి ‘పార్టీ’ల ధన రాశులకు కవచంగా వ్యవహరించే కళలో ఆరితేరిన ఆడిటింగ్ కనికట్టు విద్య తెలిసిందే. అందుచేత ఎన్నికల ఖర్చు వెచ్చాలపై రాజకీయ పక్షాలు, అభ్యర్థులు సమర్పించే లెక్కలు కిట్టింపులేనన్నది సుస్పష్టం.
అధికార పార్టీలు ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా ట్రస్టుల నుంచి పొందుతున్న మూటలకు ఇతర పార్టీలకు వస్తున్న విరాళాల మొత్తానికి ఏనుగుకు దోమకు ఉన్నంత తేడాను ఈ లెక్కల్లో గమనించవచ్చు. ఆశ్రిత పెట్టుబాడిదారీ వ్యవస్థను పోషిస్తున్న ప్రభుత్వాలున్న దేశంలో వ్యక్తులుగాని, కార్పొరేట్ సంస్థలు గాని ఇంతింత ధనాన్ని అధికార పార్టీలకు విరాళాలుగా ఇస్తున్నాయంటే అది వాటి నిస్వార్థ త్యాగమని ఎంత మాత్రం అనుకోలేము. ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చే పద్ధతిని మరింత కఠినం చేయాలని, పరస్పర ప్రయోజనాల కోసం జరిగే దొడ్డి దారి బాగోతాన్ని అనుమతించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నా ఈ విరాళాల కుంభవృష్టికి తెర పడడం లేదు.
ఇటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల ఛత్రం కింద మేలు విరాళాల దాతలకే జరుగుతుంది గాని ఓటు వేసి అధికారానికి పంపించిన కోట్లాది సాధారణ ప్రజలకు ఎంతమాత్రం ఎటువంటి శ్రేయస్సు కలగబోదని ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. ఇది ధనస్వామ్యమే గాని ప్రజాస్వామ్యం కాదని అనుకోడాన్ని తప్పుపట్టలేము. రాజకీయ పక్షాలకు సమర్పించుకునే విరాళాలపై కఠినమైన పరిమితిని విధించాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో అందరి ఓటుకి ఒకే విలువ ఉన్నట్టు అన్ని పార్టీలు ఒకే ధన సామర్థంతో ఎన్నికల్లో పోటీ చేసే పద్ధతిని ఆవిష్కరించాలి. అలా చేయనప్పుడు అధికారం పొడుగు చేతులదే అవుతూ పోతుంది.