బిజెపి ప్రభుత్వానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక తెలంగాణ సాధనలో భాగంగా బిసి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో ఎస్‌సిలలో వెనుకబడిన మాదిగ ఉపకులాల అభివృద్ధి అంతే ముఖ్యమని తెలంగాణ బిసి ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. అందుకోసం ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ అవసరమని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదించి బిజెపి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
తార్నాకలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అధికరణ 341ని సవరించి, దేశవ్యాప్తంగా లేదా 371డి సవరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి షెడ్యూల్ కులాల రిజర్వేషన్‌ల వర్గీకరణ చట్టము తేవచ్చని అందుకు కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సుదీర్ఘ కాలంగా భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కాశ్మీర్ సమస్య పరిష్కరించబడినట్లే వర్గీకరణ సమస్య కూడా పరిష్కరించబడుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, వర్గీకరణ బిల్లును ఆమోదించి పార్లమెంటులో చట్టం చేయాలని గాలి వినోద్ కుమార్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.