న్యూఢిల్లీ : విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. విమానంలో ఉన్న ఓ డాక్టరు, విమాన సిబ్బంది ఆ వ్యక్తికి సకాలంలో సరైన ప్రాధమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్ విమానంలో జరిగింది. కన్నూరు నుంచి దుబాయ్‌కు వెళ్లుతున్న ప్రయాణికుడు యూనస్ రాయాన్రోత్‌కు గుండెపోటు వచ్చిందని విమానయాన సంస్థ శుక్రవారం తెలిపింది. విలవిల్లాడుతూ ఈ ప్రయాణికుడు సాయం కోసం అరిచాడు. వెంటనే విమాన సిబ్బంది ఆయన వద్దకు హుటాహుటిన పరుగులు తీసింది. సెకండ్లు ఆలస్యం చేయకుండా ఆయనకు తొలి చికిత్స జరిపారు. అనుకోకుండా ఈ విమానంలోనే డాక్టర్ షబార్ అహ్మద్ కూడా తోటి ప్రయాణికుడుగా ఉన్నారు. ఆయన సాయంతో కృత్రిమ శ్వాసను అందించడం, గుండెసంబంధిత శ్వాస ప్రక్రియను సక్రమం చేయడంతో యూనస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చాలా సేపటివరకూ అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడు పలు దశల చికిత్సల తరువాత తేరుకుని కళ్లు తెరిచి చూశాడు. యధావిధిగా విమాన ప్రయాణం సాగింది.