న్యూఢిల్లీ : ఓ రైలు ప్రయాణికుడు కప్పు టీ కోసం ఏకంగా రూ. 70 చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఇందులో కప్ టీ ధర రూ 20 కాగా, సర్వీస్ ఛార్జీ రూ. 50 చెల్లించాల్సి వచ్చింది. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు ఢిల్లీభోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో జూన్ 28న ప్రయాణించాడు. కప్ టీ కొన్నందుకు రూ. 70 చెల్లించాడు. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ ఇచ్చిన ఇన్‌వాయిస్ ను ట్విటర్‌లో పెడుతూ రూ.20 టీకి, రూ.50 సర్వీస్ ఛార్జీ, మరీ ఇంత దోపిడీయా ? అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ట్వీట్ చూసిన నెటిజన్లు టూ మచ్ అంటూ కామెంట్ చేశారు. సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదంటూ రెస్టారెంట్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌లను మరికొందరు పోస్ట్ చేశారు. అయితే రైల్వే అధికారులు రాజధాని, లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేయకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ ఛార్జి చెల్లించాల్సి వస్తుందని వివరిస్తూ 2018 లో జారీ చేసిన ఓ సర్కులర్‌ను ఉదాహరణగా చూపించారు. అయితే ఈ రైళ్లలో ఫుడ్ డెలివరీకి సంబంధించి సర్వీస్ ఛార్జీ అనేది టికెట్ ఛార్జీతోపాటే ఉండేది. తర్వాత దీన్ని ప్రయాణికుల ఐచ్ఛికానికి వదిలేశారు.