ప్రమాదానికి ముందు ఎటిఎస్‌తో సంబంధాలు కోల్పోయిన ఎఎన్26 విమానం
మాస్కో: రష్యాలో మంగళవారం ఉదయం 28 మంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతయిన విమానం సముద్రంలో కూలిపోయినట్లు రష్యా ఎమర్జెన్సీ సర్వీసెస్ గుర్తించింది. విమాన శకలాలు అది దిగాల్సిన విమానాశ్రయం రన్‌వేకు అయిదు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చెల్లా చెదరుగా పడి ఉన్నట్లు గుర్తించారని అధికారులు తెలిపారు. ఆంటనోవ్ ఎఎన్26 విమానం కూలిపోయిన స్థలానికి కొన్ని నౌకలు కూడా వెళ్తున్నట్లు వారు తెలిపారు. రష్యాలోని తూర్పు కమట్కా ద్వీపకల్పం వద్ద ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో దుర్ఘటన చోటు చేసుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫార్‌ఈస్ట్ ప్రాంతంలోని పెట్రోపవ్లోస్క్ కామ్‌చట్‌స్కీనుంచి ఉత్తర కమ్చట్కాలోని పలనా పట్టణానికి వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)తో విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రమాదానికి గురయిన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో ఎవరూ బతికి ఉండే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ప్రయాణికుల్లో పలనా మేయర్ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు చెప్పినట్లు మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ పేర్కొన్నట్లు మీడియా తెలిపింది. కాగా విమానం సాంకేతికంగా బాగానే ఉందని, ప్రమాదంపై దర్యాప్తు జరుపుతామని విమానం ఆపరేటర్ కమ్చట్కా ఏవియేషన్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ అలెక్సీ ఖబరోవ్ ఙంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజన్సీకి చెప్పారు.