Saturday, November 23, 2024

రెండునెలల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు

- Advertisement -
- Advertisement -
Passenger trains restart in two months
కసరత్తు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే
నష్టాలను తగ్గించుకునేందుకు అధికారుల ప్రణాళికలు

హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లను రెండునెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నెలాఖరు నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే, ప్రస్తుతం స్పెషల్ రైళ్లను మాత్రమే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేయడంతో ఆ దిశగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులు కావడంతో ప్యాసింజర్ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.

కరోనా కేసులు విస్తరించే అవకాశం

ఎక్స్‌ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్‌ను సైతం ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే ఆలస్యం అయ్యిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

70 శాతం రాయితీగా..

ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతం భారం పడుతుండగా, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోంది. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు మాత్రమే ఉంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్‌లో కచ్చితంగా ఆగాల్సిందే. ఇలా ఆపడం వలన డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీల భారం రైల్వే శాఖకు అదనం అవుతోంది. 400 కి.మీ. దూరాన్ని చేరుకోవడానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్‌లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 స్టేషన్‌ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది.

రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు..

దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్‌కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. ఇంత నష్టాలొస్తున్నా సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీనిని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను 2020 మార్చి నెలాఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. కానీ ప్యాసింజర్ రైళ్లను ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం లేదని సమాచారం. కానీ దక్షిణమధ్య రైల్వే మాత్రం రెండునెలల్లో ప్రయాణికులకు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపింది.

నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 350….

దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 350 ఉండగా, ప్యాసింజర్ రైళ్లు 200లు ఉంటాయి. నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించే వారు 10.5 లక్షలు కాగా, వీరిలో అన్‌రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కేవారు 8 లక్షలు మంది ఉంటారని అధికారులు తెలిపారు. నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.1,2-15 కోట్లు కాగా, మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే అని అధికారులు పేర్కొన్నారు. ప్యాసింజర్ రైలు టికెట్‌పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News