బుధవారం ఢిలీ నుంచి బ్యాంకాక్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికునిపై మూత్ర విసర్జన చేసినట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘ఒక ప్రయాణికుని దురుసు ప్రవర్తన’ ఘటన బుధవారం (9న) ఢిల్లీ బ్యాంకాక్ విమానంలో జరిగిందని, ఆ విషయంపై అధికారులకు (డిజిసిఎకు) ఫిర్యాదు చేశారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సంఘటన గురించి ప్రశ్నించినప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు సమాధానం ఇస్తూ,మంత్రిత్వశాఖ ఈ ఘటనను పరిగణనలోకి తీసుకున్నదని, విమానయాన సంస్థతో మాట్లాడతామని చెప్పారు.
‘ఏదైనా తప్పు జరిగితే మేము తగిన చర్య తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. దేశ రాజధానిలో ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి విడిగా విలేకరులతో మాట్లాడారు. ‘బుధవారం ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు వెళుతున్న ఎఐ2336 విమానాన్ని నడుపుతున్న క్యాబిన్ క్రూకు సదరు దురుసు ప్రయాణికుని ప్రవర్తన గురించి నివేదించినట్లు ఎయిర్ ఇండియా ధ్రువీకరిస్తోంది’ అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. క్రూ అన్ని నిర్దేశిత నిబంధనలను అనురించారని, ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారని సంస్థ తెలియజేసింది.