నూస్ డెస్క్: కిటికీ పక్క సీటు కోసం ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం మనం చూసే ఉంటాం. కాని..విండో సీటు కోసం ఏకంగా విమానంలోనే కొందరు ప్రయాణికులు ఘర్షణపడ్డారంటే నమ్ముతారా..కాని నమ్మక తప్పదు. బ్రెజిల్ కు వెళుతున్న జిఓఎల్ ఎయిర్‌లైన్స్ విమానంలో కొందరు ప్రయాణికులు కిటికీ పక్క సీటు కోసం ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణ ప్రయాణికులు కొట్టుకునే దాకా వెళ్లింది. ఒకరినొకరు తోసుకుంటూ..కాలితో తన్నుకుంటూ ప్రయాణికులు ఎర్రబస్సు కన్నా ఘోరంగా విమానంలో వీరవిహారం చేశారు. దీంతో విమానం రెండు గంటలు ఆలస్యం బయల్దేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను మైక్ సింగ్‌టన్ అనే నెటిజన్ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు.
స్థానిక మీడియా కథనం ప్రకారం ఒక మహిళా ప్రయాణికురాలు దివ్యాంగుడైన తన కుమారుడి కోసం విండో సీటు అర్థించగా ఆ సీటులో కూర్చున్న సహ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో మాటల యుద్ధం మొదలై అది చివరకు ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి ప్రయాణికులు కొట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న విమాన సిబ్బంది జోక్యం చేసుకొని వారి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. అయిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది సాయంతో మొత్తం 15 మంది ప్రయాణికులను విమానంలోనుంచి కిందకు దింపేశారు. ఆ తర్వాత విమానం గమ్యస్థానానాకి బయల్దేరింది. ఈ సంఘటనను ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.
Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy
— Mike Sington (@MikeSington) February 3, 2023