ఇది ప్రజల భద్రతకు భంగం కలిగిస్తుంది
రైల్వే ట్రాక్‌లపై సమీక్షా సమావేశంలో ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ట్రాక్‌ను దాటటం తీవ్రమైన నేరమని, ఇది ప్రజల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించే ఇలాంటి ఘటనను నివారించడానికి ప్రజలలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. రైలు కార్యకలాపాల భద్రత సమయపాలనపై సోమవారం సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోన్ లోని రైలు కార్యకలాపాల భద్రతపై సమీక్షిస్తు రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఒక ట్రాక్టర్ రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన సంఘటనను జిఎం అరుణ్ కుమార్ జైన్ గుర్తుచేశారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రైల్వే ట్రాక్‌లు దాటుతున్నప్పుడు అనుసరించాల్సిన భద్రతా విధానాలపై గ్రామ పంచాయతీల వద్ద కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహించడం ద్వారా సాధారణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రోడ్ లెర్నింగ్‌పై లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, షార్ట్ కట్ పద్ధతులకు దూరంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైళ్ల రాకపోకల్లో భద్రతను పెంపొందించేందుకు, సమయపాలన కోల్పోయే అవకాశం ఉన్న చిన్నపాటి అసాధారణ సంఘటనలను నివారించేందుకు కొత్త ఆలోచనలు, సూచనలతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు.
జోన్‌లో రోలింగ్ స్టాక్ లభ్యత, సిగ్నలింగ్ పరికరాలు, మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు తదితరాలపై జనరల్ మేనేజర్ ఈ సందర్బంగా వారితో చర్చించారు. ముఖ్యంగా పనివేళలపై రైలు సిబ్బంది దృష్టి సారించాలని వారికి సరైన విశ్రాంతి కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలనపై చర్చించి, సమయపాలన మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ట్రాక్ మెయింటెనెన్స్ పనులు, వేగ నియంత్రణలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశించారు. ప్రారంభ స్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని రైళ్లు ఆలస్యంగా నడవడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. సమయ పాలనను మెరుగుపరిచేందుకు,పరోక్షంగా సమయపాలనను ప్రభావితం చేసే అంశాలైన రైళ్లను శుభ్రపరచడం, రైళ్ల లో నీటిని నింపడం క్యాటరింగ్ మొదలైన వాటి పై దృష్టి సారించాలని కోరారు. ప్రాథమిక నిర్వహణను పర్యవేక్షించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.
జోన్‌లో డబుల్ లైన్ సెక్షన్‌లలో రైళ్ల కదలికను మెరుగుపరచాలని, సుదూర రైళ్ల సమయపాలనపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సగటు వేగాన్ని మెరుగుపరిచే ప్రణాళికలను సమీక్షించిన ఆయన సుదూర రైళ్లపై చర్చించి గూడ్స్ రైళ్ల వేగాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులుతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 6 డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.